భైంసా ప్రశాంతం

15 Jan, 2020 04:46 IST|Sakshi
ఫైల్ ఫోటో

కొనసాగుతున్న 144 సెక్షన్‌

రాత్రిళ్లు కర్ఫ్యూ యథాతథం

ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల అధికారి పర్యటన

భైంసా/భైంసాటౌన్‌: నిర్మల్‌ జిల్లా భైంసాలో మంగళవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. కోర్బగల్లి, ఖాజిగల్లి, గుజిరిగల్లి ప్రాంతాల్లో స్థానికులు ఇళ్లకు మూకుమ్మడిగా తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి సమయంలో ప్రశాంత వాతావరణం ఉందనుకున్నలోపే కుభీర్‌ చౌరస్తా వద్ద పార్కింగ్‌లో నిలిపి ఉన్న టాటా ఏస్‌ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. ఆంక్షల నేపథ్యంలో ఇతరులను అనుమతించడం లేదు.

2 రోజులుగా ప్రతిరోజు రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. భైంసాకు చేరుకునే మార్గాల్లోనూ నిఘా పటిష్టం చేశారు. మరోవైపు భైంసా అల్లర్లకు కారకులైన 30 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అల్లర్ల కారణంగా రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. భైంసాలో చోటు చేసుకున్న పరిణామాలపై కలెక్టర్‌ ప్రశాంతి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. కాగా, మంగళవారం ఉదయం ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు శృతి ఓజా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక్కడి పరిస్థితులపై ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించారు. 

మరిన్ని వార్తలు