గ్రామాల్లో ‘144 సెక్షన్‌’!

21 Mar, 2020 01:04 IST|Sakshi

ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడొద్దు

కొత్త వ్యక్తులు ఎవరొచ్చినా సమాచారం ఇవ్వాలి..

పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ కల్లోలం నేపథ్యంలో గ్రామాల్లో నిషేధాజ్ఞలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. 144 సెక్షన్‌ తరహాలో సామూహిక జనసంచారం లేకుండా ఆంక్షలు అమలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించింది. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో కొత్త వ్యక్తుల రాకపోకలపై నిఘా పెట్టాలని సూచించింది. కొత్త వ్యక్తులు ఎవరొచ్చినా.. ఆ సమాచారాన్ని నమోదు చేసుకోవాలని, రోజువారీ నివేదికలను స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్లకు సమర్పించాలని ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, వారు ఏ దేశం నుంచి, ఏ విమానంలో వచ్చారు.. ఎప్పుడు, ఎక్కడ దిగారు.. అక్కడి నుంచి గ్రామానికి చేరుకునేసరికి మార్గమధ్యలో ఎవరెవరిని కలిశారు.. ఎక్కడ ఆగారనే వివరాలు నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

సదరు వ్యక్తులు దేశానికి చేరుకుని 14 రోజులు కాకపోతే స్వీయ క్వారంటైన్‌ వెళ్లేలా ఒత్తిడి చేయాలని, రోజూ ఆ వ్యక్తుల కదలికలపై కన్నేసి ఉంచాలని స్పష్టం చేసింది. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే ఆస్పత్రులకు పంపాలని ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన వారేకాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలు కూడా సేకరించాలని సూచించింది. ఇలా 26 అంశాలతో కూడిన నమూనాను పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అందజేసింది. ఈ నమూనాలో ప్రతిరోజు సమాచారం పంపాలని స్పష్టం చేశారు. అన్ని సమావేశాలను రద్దు చేసుకోవాలని, చట్టబద్ధంగా జరగాల్సిన సమావేశాలైతే, పరిమిత సంఖ్యలో హాజరయ్యేలా చూసుకోవాలని పేర్కొంది.

ఆఫీసు బయట నీళ్లు, సబ్బు
కోవిడ్‌ దరిచేరకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం బయట బకెట్‌ నీళ్లు, సబ్బు అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. కార్యాలయంలోకి ప్రవేశించే ముందు శుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కున్న తర్వాతే అనుమతించాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఊరుకోవద్దని తేల్చిచెప్పింది. కరోనా నేపథ్యంలో విధుల నిర్వహణలో షిఫ్ట్‌ల పద్ధతి పాటించాలని స్పష్టం చేసింది.  ఈ మేరకు శుక్రవారం ఎంపీడీవో, తహసీల్దార్లు, వైద్యాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా శాఖల ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. 

మరిన్ని వార్తలు