నేషనల్‌ పూల్‌కు 15 శాతం 

29 Jun, 2018 02:39 IST|Sakshi

వైద్య విద్య సీట్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ మెడికల్‌ సీట్ల లో 15% సీట్లను ఆలిండియా కోటా కింద నేషనల్‌ పూల్‌కు కేటాయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి మిగిలిన 85% కోటా సీట్లలో 5% సీట్లను దివ్యాంగులకు కేటాయించింది. గతంలో వీరికి కేవలం 2 శాతమే కోటా ఉండగా.. సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని 7 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,150 ఎంబీబీఎస్‌ సీట్లు, ఒక ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 100 బీడీఎస్‌ సీట్లున్నాయి.

సర్కారు తాజా ఉత్తర్వులతో వాటిలోని 15 శాతం సీట్లు నేషనల్‌ పూల్‌లోకి వెళ్లాయి. ఆ మేరకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నుంచి 173 ఎంబీబీఎస్‌ సీట్లు, మరో 15 బీడీఎస్‌ సీట్లు నేషనల్‌ పూల్‌లోకి వెళ్లాయి. ఇప్పటికే నీట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. అయితే మొదటి విడత కౌన్సెలింగ్‌ నాటికి మన రాష్ట్ర వైద్య సీట్లను నేషనల్‌ పూల్‌లో చేర్చలేదు. తాజాగా చేర్చిన నేపథ్యంలో జూలై 6 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత నీట్‌ కౌన్సెలింగ్‌ నాటికి ఆయా సీట్లలో అందరూ పోటీ పడే అవకాశముందని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 32,600 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. 

మరిన్ని వార్తలు