పాలమూరుకు ఢిల్లీ– మర్కజ్‌ దెబ్బ

4 Apr, 2020 11:56 IST|Sakshi
గద్వాల పట్టణం వేదనగర్‌లో ఆరాతీస్తున్న అధికారులు

తాజాగా మహబూబ్‌నగర్‌లో ఇద్దరికి

నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాలలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌  

ఉమ్మడి జిల్లాలో 15కు చేరిన కేసులు

కొత్తగా 42 శాంపిళ్ల సేకరణ

పాలమూరుకు ఢిల్లీ– మర్కజ్‌ దెబ్బ

యంత్రాంగం మరింత అప్రమత్తం

క్వారంటైన్‌కు అనుమానితులు

రెడ్‌ జోన్లుగా బాధితుల ప్రాంతాలు

ఢిల్లీలోని మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారిలో ముగ్గురికి, వారితో సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ఉలిక్కిపడింది. తాజాగా శుక్రవారం మహబూబ్‌నగర్‌లో రెండు;    నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలలో ఒక్కొక్కటి పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో వీటి సంఖ్య 15కు చేరింది. దీంట్లో ఓ మరణం కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  

మహబూబ్‌నగర్‌ క్రైం: ఇంతవరకు మహబూబ్‌నగర్‌లో నమోదైన ఏడు పాజిటివ్‌ కేసులలో మూడు ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహించిన ఇద్దరు ఉద్యోగులు కాగా, మరో వ్యక్తి వారి కుటుంబ సభ్యురాలికి వచ్చింది. మిగతా నాలుగు కేసులు ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌ ఉండటం వల్ల స్థానికంగా మరో ఇద్దరికి సోకింది. ఇంతవరకు పాజిటివ్‌ వచ్చిన వారిలో ఐదుగురు మహబూబ్‌నగర్‌ చెందిన వారు, మరో ఇద్దరు జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వారు ఉండటం గమనార్హం. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నమోదైన రెండు పాజిటివ్‌ కేసులు సైతం మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారివే. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లాలో నమోదైన ఆరు పాజిటివ్‌ కేసుల్లో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే ఉన్నారు. పాలమూరు పట్టణానికి చెందిన బాధితుల్లో ఐదుగురు 45ఏళ్లకు పైబడిన వారు ఉండటం. వీరంతా గత నెల నుంచి ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారనేది పోలీసులు, అధికార యంత్రాంగం రాబడుతోంది. వీరు సంచరించిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తులు ఇప్పటికే 92మందిని అనుమానితులుగా గుర్తించి వీరందరినీ పాలమూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల క్వారంటైన్‌కు పంపించారు. వీరు నివాసముంటున్న పరిసర ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించి అక్కడి వారు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 42మందికి సంబంధించి గొంతు, ముక్కుకు సంబంధించిన శాంపిళ్లను వైద్యాధికారులు హైదరాబాద్‌కు పంపించారు. దీంట్లో మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల నుంచి 21మంది చొప్పున శాంపిళ్లు సేకరించి పంపారు. గద్వాలలో 30మంది, నారాయణపేటలో 11మంది, నాగర్‌కర్నూల్‌లో ఐదుగురు,  వనపర్తిలో ఇద్దరు, మహబూబ్‌నగర్‌లో ఒకరు ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఇలా ఆయా జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ విస్తరించకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ, ప్రజలను మరింత అవగహన కల్పిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తు ల కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్నవారి ను ంచి ఇతరులకు వ్యాప్తి చెందకుండా వారిని క్వారంటైన్‌లో ఉండేలా కట్టడి చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు పాజిటివ్‌ తేలిన వ్యక్తులతో కలిసి తిరిగిన వారిని యుద్ధ ప్రాతిపదికన గుర్తించే కార్యచరణ ప్రారంభించింది.

పాలమూరులో ఉలిక్కిపాటు
ఢిల్లీలోని మర్కజ్‌లో పాల్గొన్న పాలమూరు పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్‌ రావడంతో వారితో సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో పాటు ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసిన ఉద్యోగికీ పాజిటివ్‌ వచ్చింది. ఈ క్రమంలో పాలమూరులో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. పట్టణంలో ప్రధానంగా రాజేంద్రనగర్, సద్దలగుండు, వీరన్నపేట, బీకేరెడ్డి కాలనీ, వన్‌టౌన్‌ ఏరియాల్లో అధికారులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, భౌతిక దూరం, నిరంతరం చేతులను శుభ్రపరచుకుంటూ ఉండాలని చెబుతున్నారు. మరోవైపు పారిశుధ్య కార్మికులు అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లుతూ, హైపోక్లోరైడ్‌ ద్రావణంతో గృహాలను శుభ్రం చేస్తూ అగ్నిమాపక శాఖ సిబ్బంది ద్రావణం పిచికారీ చేస్తున్నారు. సోడియం హైపోక్లోరైడ్‌ (డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌) ను తుంపరలా ఆయా కాలనీ వీధుల్లో చల్లుతున్నారు. 

నిత్యావసర సరకుల పంపిణీ
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాజిటివ్‌ నివేదికలు వచ్చిన వ్యక్తులున్న ప్రాంతాల్లోని వారు బయటకు రావొద్దని వీరికి కావాల్సిన నిత్యావసర సరుకులను మున్సిపాలిటీ సిబ్బందే ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటారని అధికార యంత్రాంగం వెల్లడించింది.

మర్కజ్‌కు వెళ్లొచ్చిన 127 మంది..
ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో అధ్యాత్మిక సభలకు హాజరైన జిల్లా వాసుల లెక్క తేలింది. వీరిలో అందుబాటులో ఉన్న వారిని క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. ఇక ఇప్పుడే అధికారులకు అసలైన సవాలు ఎదురవుతోంది. మార్చి మూడో వారంలో వీరంతా ఢిల్లీ నుంచి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఇళ్లకెళ్లాక ఎవరెవరిని కళాశారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. వారితో సన్నిహితంగా ఉండే కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు ఎవరెవరు.. వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూపీ లాగుతున్నారు. మర్కజ్‌ నుంచి తిరిగి వచ్చిన మహబూబ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన కొందరికి సొంత దుకాణాలున్నాయి. ఈ క్రమంలో స్థానికులతో కలిసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు వారి దుకాణాలకు ఎవరెవరు వచ్చారనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. జిల్లా నుంచి తొలుత 95మంది మర్కజ్‌ నుంచి వచ్చిన వారు అని చెప్పిన ఆ తర్వాత ఆ సంఖ్య 127కు చేరింది. ఢిల్లీ వెళ్లివచ్చిన తర్వాత ఒక్కొక్కరు అయిదుగురు వ్యక్తులను పరిగణలో తీసుకున్నా.. కనీసం 635 మందిని కలిసే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ప్రధానంగా నేరుగా ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వృత్తుల్లో ఉన్నవాళ్లు ఎక్కువ మందిని కలిసి ఉండే అవకాశం ఉందని అధికారులు ఆరా తీయడం ప్రాధాన్యతాంశంగా మారింది. ఒకవైపు ఎవరిని కలిశారనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైన అధికారులు.. మరోవైపు మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన కుటుంబ సభ్యులందరినీ ఇళ్లు దాటి బయటకు రావద్దని స్పష్టం చేశారు. స్వీయ గృహ నిర్బంధం పాటించేలా నిఘాను సైతం పెంచారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు