15 రోజులు..17 మంది

23 Jun, 2014 03:56 IST|Sakshi
  • ఇప్పటివరకు దొరికిన మృతదేహాలివి..  
  •  నేడు నగరానికి  రిత్విక్ మృతదేహం
  •  ‘బియాస్’ దుర్ఘటన నుంచి తేరుకోని విద్యార్థుల తల్లిదండ్రులు
  • సాక్షి,సిటీబ్యూరో: హిమాచల్‌ప్రదేశ్ బియాస్‌నదిలో నగర విద్యార్థులు గల్లంతై ఆదివారానికి 15రోజులు పూర్తయ్యింది. ఈ ఘటన నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా తేరుకోలేదు కదా..తల్లడిల్లిపోతున్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడి సర్కారు సాయంతో ఇంకా మృతదేహాల కోసం  తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 17 మృతదేహాలు లభ్యంకాగా..ఇంకా 8మంది దొరకాల్సి ఉంది.

    పక్కాప్రణాళికతో మృతదేహాల కోసం జరుగుతున్న గాలింపు సత్ఫలితాలను ఇస్తోంది. మొదటివారం గాలింపులో కేవలం ఆరు మృతదేహాలే లభ్యంకావడంతో మిగ తా బాధితులు ఆశలు వదులుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం అత్యాధునిక పరికారాలతో గాలింపు చర్యలు చేపట్టడంతో గడిచిన మూడురోజుల్లోనే వరుసగా మృతదేహాలు లభ్యమవుతుండడంతో బాధితుల్లో ఆశమొదలైంది. తమవారి కడచూపు చూసుకునే భాగ్యం కోసం వారు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.

    తాజాగా ఆదివారం గాలింపుచర్యల్లో నాలుగు మృతదేహాలు లభ్యమైనట్లు అక్కడి అధికారులు మన రాష్ట్రప్రభుత్వానికి సమాచారమందించారు. అందులో నల్లకుంటకు చెందిన రామ్మోహన్‌రావు కుమారుడు బైరినేని రిత్విక్ మృతదేహం ఉంది. పోస్టుమార్టం అనంతరం సోమవారం రిత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం అక్కడినుంచి నల్లకుంటలోని నివాసానికి చేరుకోనుంది.

    ఈ విషయం తెలియగానే నల్లకుంటలోని రిత్విక్ ఇంటికి భారీసంఖ్యలో స్నేహితులు,బంధువులు, బస్తీవాసులు చేరుకోవడంతో విషాదచాయలు అలుముకున్నాయి. వారి కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. సోమవారం సాయంత్రం రిత్విక్ అంత్యక్రియలు జరగనున్నాయి. నగరానికి చెందిన మరో నలుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యంకావాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా