లారీని ఢీకొన్న బస్సు: 15 మందికి గాయాలు

20 Dec, 2018 02:34 IST|Sakshi
ప్రమాదంలో దెబ్బతిన్న వజ్ర బస్సు

రామాయంపేట(మెదక్‌): రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఆర్టీసీ వజ్ర మినీ బస్సు వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బుధవారం మెదక్‌ జిల్లా రామాయంపేట శివారులో దామరచెరువు స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ చెడిపోవడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. కాగా, నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వేగంగా వెళ్తున్న మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ వజ్ర బస్సు ప్రమాదవశాత్తు రోడ్డుపైన ఆగి ఉన్న ఆ లారీని వెనుక నుంచి ఢీకొంది.

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ రవీందర్‌రెడ్డితో పాటు నిజామాబాద్‌కు చెందిన రమేశ్‌ జాదవ్, ఆయన భార్య మీరా, కూతురు శరణ్య, చంద్రకుమార్, సాయన్న, జానకంపేటకు చెందిన వీరేశం, బాన్స్‌వాడకు చెందిన విఠల్, బోధన్‌కు చెందిన నర్సింహారావు, ఆయన బంధువు సుబ్బయ్యకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరందరినీ 108 అంబులెన్సుల్లో రామాయంపేట, బిక్కనూర్‌ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో బస్సు డ్రైవర్‌ రవీందర్‌రెడ్డితో పాటు రమేశ్‌జాదవ్, సాయన్నను మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌ తరలించారు. స్వల్పంగా గాయపడ్డ మరో ఐదుగురు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వెళ్లి పోయారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు