బాంబు అనుకుని తెరిస్తే బంగారం.. 

4 Feb, 2020 04:59 IST|Sakshi
బ్యాగ్‌లో బయటపడ్డ మోటార్‌

శంషాబాద్‌లో బయటపడిన 1.5 కేజీల బంగారం

శంషాబాద్‌: అనుమానిత వస్తువుగా భావించిన ఓ బ్యాగులో బంగారం బయటపడిన ఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానాశ్రయంలోని అంతర్జాతీయ అరైవల్‌లో బ్యాగులు తీసుకొచ్చే బెల్టుపై ఆదివారం రాత్రి ఓ బ్యాగు మిగిలిపోయింది. ప్రయాణికులు ఎవరూ దానిని తీసుకోకపోవడంతో సీసీ కెమెరాల్లో పరిశీలించిన అధికారులు వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో బాంబు ఉండవచ్చేమోనని అనుమానించిన అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్‌ బృందాన్ని రంగంలోకి దింపారు.

బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని నిర్ధారించారు. స్కానింగ్‌ ద్వారా బ్యాగ్‌లో ఓ అనుమానిత వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అందులో ఉన్న ఓ ఎలక్ట్రానిక్‌ మోటార్‌ను బయటికి తీశారు. దానిని బద్దలు చేసి చూడగా.. బంగారు ప్లేట్లకు ఇనుప పూతపూసి మోటారులో పెట్టినట్లు గుర్తించారు. ఈ బంగారు ప్లేట్ల బరువు దాదాపు 1.5 కేజీలు ఉన్నట్లు తెలిపారు. దీనిని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు గమనించిన ప్రయాణికుడే దానిని బెల్టుపై వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ప్రయాణికుడు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

బంగారు ప్లేట్లపై ఇనుపపూత

మరిన్ని వార్తలు