హై అలర్ట్‌

1 Apr, 2020 07:52 IST|Sakshi
వెల్దండకు చెందిన కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలిస్తున్న సిబ్బంది

ఢిల్లీ ప్రార్థనలో జిల్లా వాసులు

17న స్వగ్రామాలకు చేరిన ముగ్గురు.. ఇంకా అక్కడే ఇద్దరు

ఒకరు గాంధీకి.. మరో ఇద్దరు ఎంజీఎంకు తరలింపు

15 రోజులుగా ఎక్కడెక్కడ తిరిగారో ఆరా తీస్తున్న అధికారులు

జనగామ: ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జనగామలో హైఅలర్ట్‌ నెలకొంది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్న సమయంలో నిజాముద్దీన్‌ ఘటన ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. జనగామ జిల్లా కేంద్రంతోపాటు నర్మెట మండలం వెల్దండకు చెందిన ఐదుగురు ఈనెల 15న ఢిల్లీకి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నాక 17వ తేదీన విమానంలో హైదరాబాద్‌ మీదుగా స్వస్థలాలకు చేరుకున్నారు. ఐదుగురిలో జనగామకు చెందిన ఇద్దరు అక్కడే ఉండిపోగా, ముగ్గురు మాత్రం ఇక్కడకు వచ్చారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు ప్రైవేట్‌ పని చేసుకునే వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అయితే, వీరు ఢిల్లీ నుంచి వచ్చినట్లు ముందే తెలుసుకున్న అధికారులు.. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తాము ఢిల్లీకి వెళ్లలేదనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లి వచ్చిన నాటి నుంచి వీరంతా హోం క్వారంటైన్‌లో ఉండకుండా, జనాల్లో కలిసి తిరిగినట్లు తెలుస్తోంది.

అధికారుల ఆరా
ఢిల్లీలో జరిగిన మత ప్రార్ధనల్లో పాల్గొన్న కుటుంబాల వద్దకు వైద్యారోగ్యశాఖ తో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి, నర్మెట మండలం వెల్లండకు చెందిన వాసిగా తేలింది. ఇందులో వెల్లండ గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు ఆయన భార్య, కుమారుడిని రెస్క్యూ టీం పర్యవేక్షణలో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. జనగామకు చెందిన ఇద్దరిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వారి కుటుంబీకులను హోం ఐసోలేషన్‌లోనే ఉంచారు. వీరికి సంబంధించిన నివేదికలు వచ్చాక అధికారులు వివరాలు వెల్లడించనున్నారు.

వెల్దండలో ఇంటింటి సర్వే
ఢిల్లీ ఘటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో బ్లీచింగ్‌ చేస్తుండగా, వెల్లండ గ్రామంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. వెల్దండకు చెందిన వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చాక ఆ విషయాన్ని దాచి గ్రామంలో మటన్, చికెన్‌ విక్రయాలు చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా తెలియగా సోమవారం గ్రామానికి వెళ్లిన అధికారులు ఆయనను హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. ఇక మంగళవారం సదరు వ్యక్తితో పాటు ఆయన భార్య, కుమారుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనతో సన్నిహితంగా తిరిగిన 35 కుటుంబాల వ్యక్తులకు హోం క్వారంటైన్‌ విధిస్తూ నోటీసులు జారీ చేశారు. డీసీపీ శ్రీనివాస్, సీఐ రాపెల్లి సంతోష్‌ కుమార్, ఎస్సై జక్కుల పరమేశ్వర్, సిబ్బంది జి.నర్సింగారావు, జి.భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ లగిశెట్టి అశోక్‌కుమార్, కరోనా బృందానికి చెందిన డాక్టర్‌ మోజెస్‌ రాజ్, ఎస్‌యూఓలు రవీందర్, సంతోష్‌ కుమార్, సర్పంచ్‌ నర్రా వెంకట రమణారెడ్డి, ఆరోగ్యమిత్ర లక్ష్మారెడ్డి, వీఆర్వో రవీందర్, వీఆర్‌ఏ అబ్బయ్య, ఏఎన్‌ఎం అమృత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు