దుబాయ్‌ టూ హైదరాబాద్‌

30 May, 2020 12:48 IST|Sakshi
దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో వలస కార్మికులతో జనగామ శ్రీనివాస్‌

 దాతల సహకారంతో స్వరాష్ట్రానికి చేరిన 150 మంది వలస కార్మికులు

లాక్‌డౌన్‌తో మూతబడిన కంపెనీలు

రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

మోర్తాడ్‌(బాల్కొండ): పొట్ట కూటి కోసం గల్ఫ్‌ బాట పట్టిన తెలంగాణ కార్మికులు కరోనా సృష్టించిన కల్లోలంతో ఉపాధిని కోల్పోయారు. ప్రధానంగా దుబాయ్, షార్జాలలోని పలు కంపెనీల్లో పని చేస్తున్న తెలంగాణ కార్మికులు లాక్‌డౌన్‌ వల్ల రోడ్డున పడ్డారు. తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు 500 మంది కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉండగా వారిని షార్జాలోని పారిశ్రామిక వాడలో షెల్టర్‌కు తరలించారు. వీరికి ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పించారు. ఇందులో 150 మంది కార్మికులు ఇండ్లకు వెళ్లడానికి దుబాయ్‌లోని మన రాయబార కార్యాలయం అధికారులు అనుమతి ఇవ్వగా ఈ రోజు దుబాయ్‌ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరందరికి బాప్స్‌ అనే దేవాలయ సంస్థ ఉచిత విమాన టిక్కెట్లను సమకూర్చింది. అలాగే షార్జాలోనిషెల్టర్‌లో ఉన్న ఇతర కార్మికులకు వాలంటీర్లు భోజన సదుపాయాలను సమకూరుస్తున్నారు. వందే భారత్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా షెల్టర్‌లో ఉన్న కార్మికులు అందరిని దశల వారీగా స్వరాష్ట్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

రాయబార కార్యాలయం అధికారుల సహాయం మరువలేనిది...
లాక్‌డౌన్‌తో వీధిన పడ్డ తెలంగాణ కార్మికులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు వారిని క్షేమంగా ఇండ్లకు పంపించడానికి దుబాయ్‌లోని మన రాయబార కార్యాలయం అధికారులు చేసిన కృషి మరువలేనిది. ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ విపుల్, కాన్సులేట్‌ అధికారులు అజిత్‌సింగ్, బాప్స్‌ సంస్థ ప్రతినిధులు అశోక్, నరేష్, రూపేష్, ప్రవాస భారతీయ సమ్మాన్‌ అవార్డు గ్రహీత గిరీష్‌ పంత్‌ల సహకారంతో తెలంగాణ కార్మికులకు విలువైన సేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హైదరాబాద్‌ చేరుకున్న కార్మికులకు ఉచిత క్వారంటైన్‌ను కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం విమాన చార్జీలను వాపసు చేయాలి.
– జనగామ శ్రీనివాస్, ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరం ఉపాధ్యక్షుడు(దుబాయ్‌)

మరిన్ని వార్తలు