ఒక యాప్‌.. 150 సేవలు..!

26 Apr, 2018 00:45 IST|Sakshi

       రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులన్నీ ఇక ఒకే యాప్‌లో.. 

     ‘టీ యాప్‌ ఫోలియో’తో మీసేవలన్నీ అందుబాటులోకి.. 

     ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తులు, బిల్లుల చెల్లింపు సులభం 

     వినియోగదారులపై తగ్గనున్న మీసేవ చార్జీల భారం 

     ఏడాదిలో వెయ్యి సేవలు: మీసేవ కమిషనర్‌ వెంకటేశ్వరరావు

సాక్షి, హైదరాబాద్‌: ఒక్క యాప్‌.. 150 ప్రభుత్వ సర్వీసులు.. అరచేతిలోనే మీసేవలన్నింటినీ పొందే వెసులుబాటు.. ఉన్న చోటు నుంచే ప్రభుత్వ సేవలను పొందేందుకు వీలుగా టీయాప్‌ ఫోలియో అనే అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మీసేవా కేంద్రాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే పని లేకుండా.. ఇంట్లో నుంచే ఫోన్‌ ద్వారా వాటిని పొందే సౌకర్యాన్ని టీయాప్‌ ఫోలియో కల్పిస్తుంది. ఐటీ శాఖతో పాటు ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ సంస్థలు సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి. ప్రభుత్వ సేవలను సులువుగా పొందడమేకాక మీసేవ కేంద్రాల్లో చెల్లించే నగదు కన్నా తక్కువ ఖర్చు కావడం ఈ యాప్‌ ప్రత్యేకత. 

ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా.. 
వాస్తవానికి కులం, ఆదాయం వంటి ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రానికి వెళ్లాలి. టీయాప్‌ ఫోలియోతో మీసేవ సర్వీసులన్నీ ఓపెన్‌ ఆన్‌లైన్‌లోకి వస్తాయి. అంటే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీసేవా కేంద్రానికి వెళ్లకుండా ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా.. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా తొలుత 150 సేవలను ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. ఇందుకోసం మొబైల్, ఆధార్‌ నంబర్‌తో యాప్‌లో ముందుగా అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం అయిన వారే సంబంధిత ధ్రువీకరణ పత్రాల కోసం యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇప్పటి వరకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నా.. తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగితే కానీ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవి కావు. కొత్త విధానం వల్ల మీసేవలో చెల్లించే దరఖాస్తు రుసుం తప్పుతుంది.

ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే.. 
గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి టీయాప్‌ ఫోలియో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మెయిల్, పాన్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ కావొచ్చు. అందులో కనిపించే సర్వీసుల్లో మనకు అవసరమైన దానిని ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి. ఫీజు చెల్లింపు ఉంటే పూర్తి చేయాలి. అంతే కోరుకున్న సర్టిఫికెట్‌ వస్తుంది. 

యాప్‌ ప్రత్యేకతలు ఇవీ.. 
కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, స్థానికత గుర్తింపు, ఆర్‌వోఆర్‌ పహాణీలు, రిజర్వేషన్‌ బుకింగ్, ప్రీమియం చెల్లింపులు, దైవదర్శన టికెట్‌ బుకింగ్‌లు, వ్యవసాయ, రవాణా శాఖ, ఉద్యోగులు, కార్మికుల కోసం సేవలు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్ష రుసుములను చెల్లించవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. యాప్‌ ద్వారా పరీక్షా ఫలితాలూ తెలుస్తాయి. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్‌ రీచార్జ్, ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్‌ బిల్లు చెల్లింపు, డీటీహెచ్, డేటా కార్డు రీచార్జ్‌ చేసుకోవచ్చు. 

ఏడాదిలో వెయ్యి సేవలు..
మరో ఆరు నెలల్లో 500 సేవలు.. ఏడాదిలో వెయ్యి సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాం. 600 వరకు ప్రభుత్వ సర్వీసులు కాగా.. 400 వరకూ ఇన్ఫర్మేషన్, రేషన్, హోటల్స్, మెట్రో సర్వీసులు మీరు ఉన్న చోటుకు ఎక్కడ దగ్గర ఉన్నాయో తెలుపుతాయి. ఏమైనా ఇబ్బందులుంటే ప్రజలు తెలియజేయవచ్చు.   
– జీటీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిషనర్, మీసేవ

>
మరిన్ని వార్తలు