గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో 1,500 పడకలు

29 Mar, 2020 03:29 IST|Sakshi

ఎక్కడా రెడ్‌జోన్లు లేవు: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో 1,500 పడకలు ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శనివారం ఆయన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఇక్కడ 3వేల మందికి సరిపడా నీళ్ల ట్యాంకులు అందుబాటులో ఉంచుతామని, 10 లక్షల లీటర్ల నీరు పట్టేలా సంప్‌ నిర్మించాలని అధికారులకు సూచించారు. ప్రతి నల్లా దానంతటదే ఆగిపోయేలా ఉండాలని, ప్రతీ బాత్‌రూం శుభ్రంగా ఉండాలని, అవసరమైతే తాత్కాలిక బాత్‌రూంలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పనులన్నీ శాశ్వత ప్రాతిపదికన చేస్తామన్నారు. ఆయా పనుల్లో నాణ్యమైన పరికరాలనే వాడాలని అధికారులకు సూచించారు. పడకలు శుభ్రంగా ఉంచాలని, స్టాఫ్‌కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

పెద్ద సంస్థకు భోజన క్యాటరింగ్‌ ఆర్డర్‌ ఇవ్వాలని, సెంట్రల్‌ ఎయిర్‌ కండిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. మూడు రోజుల్లో మూడు ఫ్లోర్‌లు, ఆ తర్వాత మూడు రోజుల్లో మరో మూడు ఫ్లోర్లు సిద్ధం చేయాలన్నారు. దీనిని 20 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఇవన్నీ అవసరం పడకపోవచ్చు కానీ సిద్ధంగా ఉంచాలన్న సీఎం ఆదేశంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొందరు సోషల్‌ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సైకోలు, శాడిస్టులు పెట్టే వార్తలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఎక్కడా రెడ్‌జోన్లు లేవన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారంతా ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి ఈటల వివరించారు.

మరిన్ని వార్తలు