125 ఎకరాల్లో 15,660 ‘డబుల్‌’ ఇళ్లు 

12 Aug, 2018 03:21 IST|Sakshi
అధికారులతో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో బొంతు రామ్మోహన్, జనార్దన్‌రెడ్డి

  కొల్లూరులో దేశంలోనే అతిపెద్ద గృహ సముదాయం: కేటీఆర్‌

  ఉన్నతాధికారులతో కలసి నిర్మాణ పనుల ఆకస్మిక తనిఖీ

సాక్షి, హైదరాబాద్‌: పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల కార్యక్రమం దేశంలోనే చరిత్ర సృష్టించనుందని పురపాలకశాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. హైదరాబాద్‌ శివార్లలోని కొల్లూరులో సుమారు 125 ఎకరాల్లో చేపట్టిన 15,660 డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయ నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డిలతో కలసి కేటీఆర్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్లు అతిపెద్ద గృహ సముదాయంగా మారబోతున్నాయన్నారు. 9.65 మిలియన్‌ చదరపు అడుగుల వైశాల్యంలో సకల సౌకర్యాలతో ఈ నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు.

ప్రభుత్వరంగంలో దేశంలోనే ఇప్పటివరకు ఇంత పెద్ద గృహ సముదాయాన్ని ఒకేచోట నిర్మించలేదన్నారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు అందించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ నిధులతో కొల్లూరులో నిర్మాణం చేపడుతున్నట్లు కేటీఆర్‌ వివరించారు. ఈ సముదాయం ద్వారా కొల్లూరు ప్రాంతం ఒక పట్టణంగా మారుతుందని, 70 వేలకుపైగా జనాభా అక్కడ నివాసం ఉంటుందని చెప్పారు. గృహ సముదాయంలో వాణిజ్య సముదాయం నిర్మించి దాని నుంచి వచ్చే ఆదాయంతో లిఫ్ట్లులు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఉపయోగపడేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు. మురుగునీటి జలాల శుద్ధి కోసం ప్రత్యేకంగా ప్లాంటు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కొల్లూరులో భారీగా ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో పనుల పర్యవేక్షణ కోసం అక్కడే ప్రత్యేకంగా ఇంజనీరింగ్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నిర్మాణ స్థలంలో జరుగుతున్న పనుల తీరుపై కేటీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, రోజూ మూడు షిఫ్టుల్లో దాదాపు 3,500 మంది కార్మికులు, 400 మంది సిబ్బంది పని చేస్తున్నారని అధికారులు  మంత్రికి వివరించారు. పనులను నిరంతరం పర్యవేక్షించడానికి నిర్మాణ సముదాయం వద్ద సీసీ కెమెరాలు అమర్చామన్నారు.  

మరిన్ని వార్తలు