కొత్త కోర్సుల్లో 15,690 సీట్లు 

14 Jul, 2020 03:28 IST|Sakshi

అనుమతులు ఇచ్చిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి

మొత్తంగా రాష్ట్రంలో 1.10 లక్షల సీట్లకు అనుమతులు జారీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ కోర్సులో 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుబంధ గుర్తింపును జారీ చేసింది. అందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మిషన్‌ లెర్నింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి కొత్త కోర్సుల్లో 15,690 సీట్లకు అనుమతులను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, కంప్యూటర్‌ సైన్స్‌ నెట్‌వర్క్స్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కోర్సుల్లో 15,690 సీట్లకు ఏఐసీటీఈ ఓకే చెప్పింది. వీటితోపాటు కంప్యూటర్‌ సైన్స్‌లో 23,040 సీట్లు, ఈసీఈలో 18,495 సీట్లకు, ఈఈఈలో 8,430 సీట్లు, ఇతర కోర్సుల్లో మిగతా సీట్లకు అనుమతి ఇచ్చింది. 

ఈసారి అనుబంధ గుర్తింపు లభించేదెన్నింటికో.. 
రాష్ట్రంలో ప్రతి ఏటా ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన కాలేజీల్లోని అన్ని కాలేజీలకు, సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడం లేదు. చాలా వరకు కోత పెడుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో 216 కాలేజీల్లో 1,11,790 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇవ్వగా, యూనివర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్లకు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అంటే దాదాపు 14 వేల వరకు సీట్లకు కోత పెట్టాయి. ఈసారి కూడా ఏఐసీటీఈ రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,10,873 సీట్లకు అనుమతి ఇచ్చింది. అయితే యూనివర్సిటీలు అందులో ఎన్ని సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇస్తాయో వేచి చూడాల్సిందే.

అయితే ఇందులో కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న సీట్లే 15,690 ఉన్నాయి. ఇపుడు వాటన్నింటికి అనుబంధ గుర్తింపును ఇస్తాయా? కాలేజీల స్థాయిని బట్టి, వసతులను బట్టి కోత పెడతాయా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఈసారి చాలా కాలేజీలు తమ కాలేజీల్లో పాత కోర్సులను, బ్రాంచీలను, సీట్లను రద్దు చేసుకొని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇలా దాదాపు 8 వేల సీట్లను రద్దు చేసుకున్నాయి. అలా రద్దు చేసుకున్న సీట్ల సంఖ్యతో పాటు అదనంగా సీట్లకు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్ని కాలేజీల్లో, ఎన్ని సీట్లకు అనుమతి ఇస్తాయి? ఎన్నింటికి కోత పెడతాయన్నది ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో తేలనుంది.

>
మరిన్ని వార్తలు