16 మంది ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం

10 Mar, 2019 18:55 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి 

కాళేశ్వరానికి 50 శాతం నిధులు కేటాయించేలా చేస్తాం

ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

బాన్సువాడ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని, ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు కేటాయించగా, తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన కాళేశ్వరానికి నయాపైసా నిధులు ఇవ్వలేదని రాష్ట్ర రోడ్డు, రవాణా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని, కేంద్రం పై ఒత్తిడి పెంచుతామన్నారు. శనివారం ఆయన బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా పోచారం భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ నా యకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును అప్పులు చేసి నిర్మిస్తున్నామని, కేంద్రం నిధులు ఇస్తే ఎంతో సునాయసంగా పనులు పూర్తయ్యేవన్నారు. రాష్ట్రంలో 3,225 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దీనికి నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎన్ని రకాల ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదని, వచ్చే ఎన్నికల్లో 15 టీఆర్‌ఎస్, ఒక మజ్లిస్‌ స్థానంలో అభ్యర్థులను గెలిపిస్తే, కేంద్రం మెడలు వంచి నిధులు తెప్పించుకోవచ్చన్నారు.

స్పీకర్‌ పోచారం తండ్రితో సమానులు 
స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి మంచి మిత్రులని, వారు గతంలో టీడీపీలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేశారని మంత్రి వేముల అన్నారు. 40 ఏళ్లుగా మా కుటుంబాల మధ్య అనుబంధం కొనసాగుతోందని, స్పీకర్‌ తనకు తండ్రి సమా నులన్నారు. స్పీకర్‌గా ఆయన, శాసన సభా వ్యవహారాల మంత్రిగా తాను కలిసి పనిచేయడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, దేశాయిపేట సొసైటీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మోహన్‌ నాయక్, మహ్మద్‌ ఎజాస్, బాలకిషన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు