16 మంది వెలి 

26 Jan, 2019 03:15 IST|Sakshi
వెలివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కాచనపల్లి వాసులు

ఓటమికి కారణమయ్యారని న్యూడెమోక్రసీ నేతల హుకుం 

బయ్యారం: గ్రామ పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థి ఓటమికి పరోక్షంగా కారణమయ్యారనే నెపంతో మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కాచనపల్లికి చెందిన కాంగ్రెస్‌ శ్రేణులను న్యూడెమోక్రసీ నాయకులు వెలివేశారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన కాచనపల్లిలో సర్పంచ్‌ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ముడిగ వజ్జయ్య, కాంగ్రెస్‌ నుంచి భూక్యా రమేశ్, న్యూడెమోక్రసీ పార్టీ నుంచి కొట్టెం వెంకటేశ్వర్లు పోటీ చేశారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన ముడిగ వజ్జయ్య న్యూడెమోక్రసీ పార్టీ బలపర్చిన అభ్యర్థి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు.

కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రమేశ్, వజ్జయ్యకు మద్దతు ఇవ్వడం వల్లనే తమ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యాడని ఆరోపిస్తూ న్యూడెమోక్రసీ సర్పంచ్‌ అభ్యర్థి కొట్టెం వెంకటేశ్వర్లుతో పాటు కొట్టెం రామారావు, సీతారాములు, రమేశ్‌ తదితరులు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలైన కొట్టెం పాపారావు, కొట్టెం చిన్నవెంకన్న, కొట్టెం లక్ష్మయ్య, కృష్ణ, రాందాస్, పాపారావుతో పాటు పలువురిని వెలివేశారు. ఇతరులతో మాట్లాడిన, తాగునీరు పట్టుకున్న, తమ పశువులను తోలుకెళ్లినా రూ.15 వేల జరిమానా విధిస్తామని తీర్మానించారని బాధితులు వాపోయారు. కాగా ఈ విషయంపై కాచనపల్లికి చెందిన 16 కుటుంబాల వారు బయ్యారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు