వెట్టి బతుకులు!

19 Nov, 2017 08:37 IST|Sakshi

 అధికారుల నిర్లక్ష్యంతో గాల్లో కలిసిన అమాయకుల ప్రాణాలు 

‘పాలమూరు’ కూలీల వివరాల సేకరణలో  కార్మికశాఖ విఫలం 

ఇతర రాష్ట్రాల కార్మికుల మృతితో  తేటతెల్లం

సాక్షి, నాగర్‌కర్నూల్‌/ నాగర్‌కర్నూల్‌ క్రైం: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పలు ప్రాజెక్టుల్లో పనులు చేసేందుకు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి కోటిఆశలతో వలసొచ్చిన కూలీల విషాదాంతమిది. జిల్లాలోని పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లిఫ్ట్‌–1 వద్ద పలు రకాల పనులు చేసేందుకు చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా కింజోలి, చిత్తాపూర్, ఒడియాపాల్, దోన్వా గ్రామాలకు చెందిన కార్మికులు ఏడాది క్రితం జిల్లాకు వచ్చారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పలు పనుల్లో వీరు కార్మికులుగా పనిచేస్తూ నెలనెలా తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తున్నారు. శనివారం ఉదయం వీరు ఉంటున్న క్యాంపు నుంచి పనులు జరుగుతున్న ప్రాంతానికి టిప్పర్‌లో వెళ్తుండగా బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. దీంతో అందులోని 16మంది చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో సుమారు 15–20 నిమిషాలపాటు వీరి ఆర్తనాదాలు అడవిపాలయ్యాయి. ఆ తర్వాత అటుగా వెళ్తున్న వారు గమనించి ఒక్కొక్కరిని ముళ్లపొదల నుంచి రక్తమోడిన శరీరాలతో రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి చికిత్స నిమిత్తం తరలించారు.  

తహసీల్దార్ల ద్వారా.. 
అయితే ఒక గ్రామం నుంచి ఉపాధి కోసం మరో ప్రాంతానికి వలస వెళ్లాలంటే తప్పనిసరిగా అలాంటి వారి పూర్తి వివరాలు నమోదు చేయాలి. వారికి సంబంధించిన పూర్తి వివరాలను తహసీల్దార్ల ద్వారా కార్మిక శాఖ సేకరించాలి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కూలీలను కార్మిక శాఖ అధికారులు నమోదు చేసుకుని వారి రాష్ట్రాన్ని, జిల్లాను, గ్రామాన్ని, వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి ఫొటోలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు బీమా సౌకర్యం ఉందా.. ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారా అన్న అంశాలపై వాకబు చేయాలి. జిల్లాలోని అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో శనివారం జరిగిన ప్రమాదంలో గాయపడ్డ, మరణించిన వారి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు తలకు మించిన భారంగా తయారైంది. ఎవరు ఎక్కడి వారో.. వారు మరణించారన్న వార్త ఎవరికి తెలియజేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.  

ముఖం చాటేసిన కంపెనీ.. 
నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే నవయుగ ఎన్‌ఈసీ కంపెనీల ప్రతినిధులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కూలీల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు కంపెనీ వారిని కఠినంగా శిక్షించాలని, వారిపై కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా 
టిప్పర్‌ ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు.  ఈ ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందని, మరో రూ.10 లక్షల బీమా సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటా మన్నారు. గాయపడిన కూలీలకు వైద్యఖర్చులతోపాటు రూ.2 లక్షలు చెల్లించేందుకు కాంట్రాక్ట్‌ సంస్థ ఆదేశాలు జారీ చేసిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.

పొట్ట చేతపట్టుకుని వలసలకు పేరుగాంచిన జిల్లాకే వలస వచ్చారు.. అనుకోని సంఘటనతో ముగ్గురు అమాయకుల ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. మరికొందరు రెక్కలు తెగిన పక్షుల మాదిరిగా మారాయి. ఈ ఘటనతో వలస కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు.. కుటుంబ సభ్యులు ఎవరు.. వీరికి బీమా సౌకర్యం ఉందా.. ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారా.. తదితర వివరాలు సేకరించడంలో కార్మికశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు