కోకాపేట భూములు ప్రభుత్వానివే

5 Oct, 2017 01:01 IST|Sakshi

1,632 ఎకరాలపై స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

జాగీర్ల రద్దు చట్టంతో అవి ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి

నుస్రత్‌ జంగ్‌ వారసులకు ఎటువంటి హక్కులూ లేవు

వారసుల ప్రతినిధి కేఎస్‌బీ అలీ పిటిషన్‌ కొట్టివేత

రూ. 16 వేల కోట్ల విలువైన భూములపై స్పష్టత

ఇక తెరపైకి కోకాపేట ‘నష్ట పరిహారం’ కేసు

‘వేలం’ భూముల పిటిషన్లపై 10న విచారణ

సాక్షి, హైదరాబాద్‌ : నిజాం నవాబు వద్ద జాగీర్గార్‌గా పనిచేసిన నవాబ్‌ నుస్రత్‌ జంగ్‌ బహదూర్‌–1కి చెందిన కోకాపేట భూములన్నీ ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. 1948 ఆగస్టు 14 నాటి జాగీర్‌ రద్దు చట్టం ప్రకారం ఆ భూములన్నీ ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయని, అందులో కేటాయింపుల మేరకు 623 ఎకరాలు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కే చెందుతాయంటూ తీర్పునిచ్చింది. ఆ భూమిపై తమకే హక్కులు ఉన్నాయంటూ నవాబ్‌ నుస్రత్‌జంగ్‌ బహదూర్‌–1 వారసుల తరఫున కేఎస్‌బీ అలీ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

వాస్తవానికి ఈ కేసులో మార్చిలోనే తుది వాదనలు ముగియగా.. కోర్టు తుది తీర్పును రిజర్వు చేసింది. అయితే ఈ నెల పదో తేదీన కోకాపేట భూముల నష్ట పరిహారం కేసు విచారణకు రానుండటంతో తీర్పు వెలువరించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు చొరవతో ఈ కేసు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఈ భూముల విలువ దాదాపు రూ.16 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వారసులు లేకపోవడంతో..
నిజాం రాజు వద్ద జాగీర్దార్‌గా పనిచేసే నవాబ్‌ నుస్రత్‌ జంగ్‌ బహదూర్‌–1 అధీనంలో కోకాపేటలోని 1,632 ఎకరాల భూమి ఉండేది. ఆయనకు సంతానం లేదు. 1875లో నుస్రత్‌ జంగ్‌ మరణించగా.. భూమి బాధ్యతలను ఆయన భార్య తీసుకుంది. అయితే నుస్రత్‌ సోదరులు ఇద్దరు ఆయనకు సంతానం లేని కారణం చూపుతూ.. ఆ భూమి తమకు ఇవ్వాలంటూ 1906లో నిజాం రాజుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు రాజు తిరస్కరించారు.

1916లో నుస్రత్‌ భార్య కూడా కన్నుమూసింది. తర్వాత వారసులెవరూ లేనందున ఆ భూమిని సర్ఫ్‌కాస్ట్‌ ల్యాండ్‌ (నిజాం సొంత భూములు)గా నిజాం రాజు గుర్తించారు. ఆ భూమి తమకు ఇవ్వాలంటూ నుస్రత్‌ సోదరులిద్దరు తిరిగి పెట్టుకున్న అభ్యర్థనను అప్పటి అడ్మినిస్ట్రేటర్‌ పక్కనపెట్టేశారు. ఇక 1948 ఆగస్టు 14న జాగీర్‌ రద్దు చట్టం, 1358 ఫస్లీని తీసుకొచ్చారు. దీని ప్రకారం నుస్రత్‌ భూమి అంతా ప్రభుత్వానికే చెందుతుంది.

నష్ట పరిహారంతో మొదలు..
1952లో ఇలాంటి భూములకు సక్సెస్‌ రైట్‌ కింద కమ్యూటేషన్‌ (నష్టపరిహారం) చెల్లించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో నుస్రత్‌ వారసులమంటూ 74 మంది ముందుకొచ్చారు. వారంతా ముంతకబ్‌ ప్రకారం ఇమామ్స్‌కు అనుగుణంగా వచ్చే రూ.3,900 తీసుకున్నారు. తర్వాత తకెట్‌ (తక్‌పట్టీ)లు ఇవ్వలేదని వారు ప్రభుత్వానికి విన్నవించడంతో... అప్పటి రెవెన్యూ మంత్రి ‘‘తకెట్‌ల పైసలు వస్తాయి. భూమిపై హక్కులు మాత్రం ఉండవ’ని స్పష్టం చేశారు.

అయితే ఆ భూమిపై కన్నేసిన నుస్రత్‌ సమీప బంధువులు.. వారసులైన తమకే ఆ భూమి హక్కులు చెందుతాయంటూ 1976లో సివిల్‌కోర్టులో పిటిషన్‌ వేశారు. దానిని విచారించిన న్యాయస్థానం.. పరిహరం చెల్లించవచ్చుకానీ, భూమిని ఇవ్వడానికి వీల్లేదని తీర్పునిచ్చింది. దీనిపై హైకోర్టులో సవాలు చేసినా.. సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది.

2002లో మళ్లీ మొదలు...
కోకాపేటలోని 1,635 ఎకరాల భూమి నుస్రత్‌ జంగ్‌ బహదూర్‌–1 వారసులైన 207 మందికి చెందుతుందని పేర్కొంటూ.. వారి తరఫున ప్రతినిధిగా కేఎస్‌బీ అలీ అనే వ్యక్తి 1999లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. దానిని స్వీకరించిన న్యాయస్థానం.. ఈ విషయంలో ఏదో ఒకటి నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేఎస్‌బీ అలీ అభ్యర్థన మేరకు కోకాపేట భూముల చరిత్ర, వివరాలన్నీ సేకరించిన సర్కారు.. జాగీర్‌ రద్దు చట్టం ప్రకారం నష్ట పరిహారం అడగడానికి వీలుందికానీ, భూమి ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీనిపై 2002లో మెమోను కూడా జారీ చేసింది. అయితే 2002లో జారీ చేసిన మెమో తప్పుగా ఇచ్చామని.. దాన్ని ఉపసంహరించుకుంటున్నామంటూ 2004 మే 16న హైకోర్టుకు వివరించింది.

తర్వాత భూమి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామంటూ జూలై 31న మరో మెమో జారీ అయింది. కానీ తర్వాత వచ్చిన అధికారులు.. ఇందులో మతలబు ఉందని గ్రహించారు. జూలై 31 నాటి మెమోను రద్దు చేస్తూ.. 2002 నాటి మెమోనే సరైనదని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కేఎస్‌బీ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తనకు అనుకూలంగా జారీ చేసిన మెమోను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వెనక్కి తీసుకుందని పిటిషన్‌ వేశారు. దానిని పరిశీలించిన న్యాయస్థానం నోటీసు ఇవ్వకుండా రద్దు చేయడం తప్పు అని పేర్కొంది.

దానిపై ప్రభుత్వం అప్పీలు చేయగా.. అసలు కేఎస్‌బీ అలీ, తదితరులకు హక్కులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ, నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సర్కారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై కేఎస్‌బీ అలీ 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. అయితే హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా చిరంజీవులు బాధ్యత స్వీకరించాక.. వేల కోట్ల విలువ చేసే ఈ భూములపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకంగా లీగల్‌ సెల్‌ అధికారులను నియమించుకుని కేసులో అనుకూలంగా తీర్పు వచ్చేలా కృషి చేశారు.
 
భూముల వేలంతో మరో వివాదం
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు కోకాపేటలో హెచ్‌ఎండీఏకు కేటాయించిన 630 ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ నుస్రత్‌ జంగ్‌ వారసుల ప్రతినిధిగా కేఎస్‌బీ అలీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిని 2006 జూలై 14న హైకోర్టు సింగిల్‌ జడ్జి కొట్టివేశారు. సరైన డిక్లరేషన్, ఇంజంక్షన్‌ పొందేందుకు సివిల్‌ కోర్టును సంప్రదించాలని సూచించారు. దాంతో కేఎస్‌బీ అలీ ధర్మాసనానికి అప్పీలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కోకాపేట భూమిపై పిటిషనర్‌కు ఎటువంటి హక్కులు లేవంటూ 2007 అక్టోబర్‌ 26న ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై పిటిషనర్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. 2006లో హైకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్, రిట్‌ అప్పీల్‌లను ఉపసంహరించి సివిల్‌ కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. మరోవైపు ప్రభుత్వం ఇదే సమయంలో కోకాపేటలోని భూములను వేలం వేసింది. ప్రధానంగా గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టు 100 ఎకరాలు, ఎంపైర్‌ 1, 2 పేరుతో 87 ఎకరాలు కలిపి 187 ఎకరాల భూమిని విక్రయించింది. అప్పట్లో విపరీతమైన రియల్‌ బూమ్‌ కారణంగా ఎకరం ధర రూ. ఐదు కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు పలికింది. మొత్తంగా ఈ భూముల విక్రయం ద్వారా రూ.1,755 కోట్లు ఆదాయం వస్తున్నట్టు అప్పట్లో లెక్కించారు.

వేలంలో భూములు దక్కించుకున్న 15 సంస్థలు.. రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించాయి. హెచ్‌ఎండీఏ ఈ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసేసింది. కానీ రియల్‌ బూమ్‌ పడిపోయి భూములకు డిమాండ్‌ తగ్గడంతో.. వేలంలో భూములు కొనుగోలు చేసిన సంస్థలు ఎదురుతిరిగాయి. ఆ భూముల యాజమాన్యపు హక్కులపై వివాదం ఉందని.. హెచ్‌ఎండీఏ దాన్ని తమకు చెప్పకుండా దాచిందని, తమ సొమ్ము తమకు తిరిగి చెల్లించాలని 14 సంస్థలు హైకోర్టులో కేసు వేశాయి. దీనిని విచారించిన సింగిల్‌ జడ్జి సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

ఈ తీర్పును వెంటనే అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సంస్థలు ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. కానీ దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. హెచ్‌ఎండీఏకు ఆ భూమిని అమ్మే హక్కు ఉందని, వాటికి సంబంధించి మిగతా సొమ్మును హెచ్‌ఎండీఏను ఆదేశించింది. దీంతో సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఆ భూముల వివాదం ఇంకా కొనసాగుతోందని, అది తేలాక డబ్బులిచ్చే విషయాన్ని ఆలోచిస్తామని హెచ్‌ఎండీఏ పేర్కొంది. తాజాగా యాజమాన్య హక్కులపై స్పష్టత రావడంతో.. ఈ నెల 10న విచారణకు రానున్న సంస్థల కేసులోనూ స్పష్టత రానుంది. 

మరిన్ని వార్తలు