169 కరోనా కేసులు 

30 May, 2020 03:55 IST|Sakshi

అందులో తెలంగాణకు చెందినవే 100

మిగిలినవి సౌదీ, వలసదారులకు చెందినవి

నలుగురు మృతి.. 71కు చేరిన మరణాలు

రాష్ట్రంలో 2,425కు చేరిన కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ నమోదుకాని రీతిలో శుక్రవారం ఏకంగా 169 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నలుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందిన వారే 100 మంది ఉన్నారు. సౌదీఅరేబియా నుంచి వచ్చిన వారిలో మరో 64 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వలసదారులు ఐదుగురికి కరోనా సోకినట్లు ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు వెల్లడించారు.

ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. మొత్తం ఇప్పటివరకు రాష్ట్రంలో 2,425 మంది కరోనా బారిన పడ్డారని తెలిపారు. వారిలో తెలంగాణకు చెందిన కేసులు 2,008 ఉండగా, వలస కార్మికులకు సంబంధించినవి 180, సౌదీ అరేబియా నుంచి వచ్చినవి 208 కేసులు, సడలింపులు ఇచ్చాక విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 30 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 71 మంది చనిపోయారు. మొత్తం 1,381 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 973 మంది చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో శుక్రవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీకి చెందిన 82 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన 14 మంది, మెదక్, సంగారెడ్డి జిల్లాల వారు ఇద్దరు చొప్పున ఉన్నారు.

వైద్యురాలికి, రిటైర్డ్‌ డాక్టర్‌కు కరోనా.. 
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యురాలికి కరోనా సోకింది. వారం రోజుల కింద అదే ఆస్పత్రికి చెందిన వైద్యుడికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. కూకట్‌పల్లికి చెందిన ఓ కేన్సర్‌ రోగికి సర్జరీ చేసిన క్రమంలో వీరిద్దరికి కరోనా సోకిందని సమాచారం. తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ రిటైర్డ్‌ డాక్టర్‌(80)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

ఇద్దరు నర్సులకు వైరస్‌.. 
లాలాగూడ రైల్వే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సు(32)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న మరో మహిళకు కరోనా సోకింది. ఈనెల 21న కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగి నుంచి ఈమెకు ఈ వైరస్‌ సోకి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఏడు నెలల చిన్నారి మృతి 
ఏడు నెలల చిన్నారి మృతి చెందిన తర్వాత కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లా హత్నూరకు చెందిన ఓ చిన్నారికి జ్వరం రావడంతో ఈనెల 27న సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు నిలోఫర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించింది. దీంతో ఆ చిన్నారి నుంచి రక్త నమూనాలు సేకరించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. చనిపోయిన ఆ పాపకు కరోనా సోకినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. దీంతో చిన్నారి అంత్యక్రియల్లో పాల్గొన్న 34 మందిని హోం క్వారంటైన్‌కు తరలించారు.

నాలుగేళ్ల బాలుడికి కరోనా.. 
మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కొడుపాకలో నాలుగేళ్ల బాబుకు కరోనా పాజిటివ్‌ సోకింది. ఈ నెల 23న బాలుడు అనారోగ్యానికి గురికావడంతో చిత్రియాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి వైద్యుడి సూచన మేరకు 25న హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. బాలుడి తండ్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి ఒకరోజు అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో అతడి ద్వారానే బాబుకు వైరస్‌ వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, చేగుంట మండల కేంద్రంలోని కుమ్మరికుంట వీధికి చెందిన ఓ ఆర్టీసీ కండక్టర్‌కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు