నల్లగొండలో 17 మంది బర్మా దేశీయులు

2 Apr, 2020 10:10 IST|Sakshi
నార్కట్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ నుంచి బర్మా దేశస్తులను హైదరాబాద్‌కు తరలిస్తున్న వైద్యులు

17 మంది గుర్తింపు

కరోనా పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలింపు

మత ప్రచారం చేసేందుకు మార్చి 17న నీలగిరికి రాక

కరోనా పరీక్షల ఫలితాల నివేదికల కోసం ఎదురుచూపులు

ఆందోళన కలిగిస్తున్న గోప్యత

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండలో 17మంది బర్మా దేశీయులను మంగళవారం రాత్రి పోలీసులు గుర్తించారు. వీరంతా మార్చి 17న నల్లగొండకు మత ప్రచార నిమిత్తం వచ్చారు. వీరిని కరోనా పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వీరి కరోనా పరీక్షల రిపోర్ట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తమ సమాచారాన్ని వెల్లడించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు..
కరోనా (కోవిడ్‌ –19) వైరస్‌ వ్యాధి నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. జిల్లా అధికార యంత్రాంగం ఈ పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, పరీక్షలు చేయించుకుని గృహ నిర్బంధంలోనే ఉండాలని పదేపదే కోరుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యానికి వేలాది మంది బలవుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో వ్యాధిని అరికట్టేందుకు చేస్తున్న హెచ్చరికలు కొందరి చెవికి ఎక్కడం లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మంగళవారం రాత్రి జిల్లా పోలీసులు నల్లగొండలో మరికొందరు విదేశీయులను గుర్తించారు. జిల్లాలో మొదట వియత్నాం నుంచి మత ప్రచారానికి వచ్చిన çపన్నెండు మంది, వారికి గైడ్‌లుగా వచ్చిన మరో ఇద్దరు.. వెరసి పధ్నాలుగు మంది గుట్టుచప్పుడు కాకుండా ఆయా ప్రార్థనా మందిరాల్లో తలదాచుకున్నారు. పోలీసు నిఘా విభాగం వీరిని గుర్తించి కరోనా వైరస్‌ పరీక్షల నిర్వహణకు హైదరాబాద్‌కు తరలించింది. ఈ సమయంలో జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, వీరందరికీ పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టు రావడంతో అటు అధికారులు, ఇటు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

వీరికి కరోనా లక్షణాలు లేకున్నా.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లోనే ఉంచి వైద్య సేవలు అందించారు. ఇది మరచిపోక ముందే.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశాలకు వెళ్లి వచ్చిన వారి ఉదంతం సంచలనం సృష్టించింది. వీరెవరూ తాము బయటి ప్రాంతాలకు వెళ్లివచ్చామని స్వచ్ఛందంగా ముందుకు రాలేదు. నిజాముద్దీన్‌లో సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిలో హైదరాబాద్, ఇతర జిల్లాల్లో మొ త్తంగా ఆరుగురు మృత్యువాత పడడంతో అసలు ఎవరెవరు నిజాముద్దీన్‌కు వెళ్లివచ్చారని పోలీసులు జల్లెడ పట్టారు. నల్లగొండ పట్టణం నుంచే ఏకంగా 44 మంది వెళ్లివచ్చారని గుర్తించి మంగళవారం వా రందరినీ అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు పరీ క్షలకోసం పంపించారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలో మరో పదిహేడు మంది బర్మా దేశస్తులు ఉన్నారని తేలడం సంచలన వార్తగా మారింది.

మార్చి 17వ తేదీన నల్లగొండకు చేరుకున్న బర్మా దేశస్తులు..
లాక్‌ డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా వైరస్‌ తీవ్రతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా బర్మా దేశం నుంచి వచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే, ఢిల్లీలోని నిజాముద్దీన్‌కు వెళ్లివచ్చిన వారిని గుర్తించడంలో భాగంగా పోలీసులు ఆయా ప్రార్థన మందిరాల్లో ఎవరెవరు ఉంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. బర్మా దేశం నుంచి మత ప్రచారం కోసం నల్లగొండకు వచ్చిన 17 మందిని నల్లగొండ పోలీసులు మంగళవారం అర్థ్దరాత్రి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరికి నార్కట్‌పల్లిలోని ఒక ఫంక్షన్‌ హాలులో వసతి కల్పించి బుధవారం కరోనా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. బర్మా దేశం నుంచి హైదరాబాద్‌లోని బాలాపూర్‌ ప్రాంతంలోని బాబానగర్‌కు చేరుకున్న వీరు మార్చి 17వ తేదీన మత ప్రచారం కోసం నల్లగొండకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని మక్కా, జమ, కువా మసీదుల్లో బర్మా దేశీయులు ఉండి మతప్రచారం చేపట్టారని పోలీసులు పేర్కొన్నారు.

ఆందోళన కలిగిస్తున్న గోప్యత..
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన ప్రదేశాల్లో తిరిగి వచ్చిన వారు, లేదా కరోనా పీడితులతో కలిసి గడిపిన వారు తమకు తాముగా అధికారులకు సమాచారం అందించి పరీక్షలు జరిపించుకుని క్వారంటైన్‌కు వెళ్లకుండా గోప్యత పాటిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వియత్నాం నుంచి వచ్చిన వారి గురించి, బర్మా నుంచి వచ్చిన వారి గురించిన సమాచారం స్థానిక ప్రజల నుంచి అందకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. చివరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారు కూడా తమ ‘ఐడెంటిటీ ’ని బయట పెట్టలేదని, పోలీసులే వారందరినీ గుర్తించారని చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిగురించి, లేదా బయటి రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి గురించిన సమాచారం జిల్లా అధికారులకు తెలియజేయాలని కోరుతున్నారు.

ఆ.. 44 మందికి కరోనా లక్షణాలు లేవు..
నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ప్రార్థనలకు నల్లగొండ నుంచి వెళ్లి వచ్చిన 44 మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. వీరిని మంగళవారం జిల్లా కేంద్రం నుంచి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌ తరలించారు. కాగా వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. వీరిని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌లకు తరలించనున్నారు. అక్కడ కొద్ది రోజులపాటు పర్యవేక్షణలో ఉంచనున్నారు.

>
మరిన్ని వార్తలు