ముగిసిన నామినేషన్ల ఘట్టం

26 Mar, 2019 01:16 IST|Sakshi

చివరి రోజు 570 నామినేషన్లు

17 ఎంపీ స్థానాలకు మొత్తం 795 దాఖలు

నిజామాబాద్‌ స్థానానికి అత్యధికంగా 245 నామినేషన్లు

అక్కడ పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికల నిర్వహణ

నేడు నామినేషన్ల పరిశీలన

28 వరకు ఉపసంహరణకు అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవగా శుక్రవారం నాటికి 220 నామినేషన్లు దాఖలయ్యాయి. శని, ఆదివారం వరుస సెలవుల తర్వాత సోమవారం చివరిరోజు నామినేషన్ల స్వీకరణ జరగ్గా ఏకంగా 570 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 795కు పెరిగింది. చివరిరోజు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి 182 నామినేషన్లు రావడంతో ఈ స్థానానికి మొత్తం నామినేషన్ల సంఖ్య 245కు పెరిగింది. మంగళవారం నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అభ్యర్థులు సరైన ఫారం–ఏ, బీలతోపాటు ఫారం–26లోని అన్ని ఖాళీలను పూరిస్తేనే నామినేషన్లను ఆమోదిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ తెలిపారు. నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థితోపాటు మరో ముగ్గురు వ్యక్తులనే అనుమతిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థి తనతోపాటు తనను ప్రతిపాదించిన వ్యక్తి, ఎన్నికల ఏజెంట్, మరోవ్యక్తిని వెంట తెచ్చుకోవచ్చన్నారు. అన్ని రకాల పత్రాలతో అభ్యర్థులు పరిశీలన కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. ఈ నెల 28తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 11న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా ఫలితాలను మే 23న ప్రకటించనున్నారు. 

నిజామాబాద్‌లో పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు
నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలు కావడంతో అక్కడ ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రజత్‌ కుమార్‌ తెలిపారు. ఒక బ్యాలెట్‌ యూనిట్‌లో 16 మంది అభ్యర్థులకు అవకా శం కల్పించవచ్చని, పాత మోడల్‌ ఈవీఎంలకు గరిష్టంగా 6 బ్యాలెట్‌ యూనిట్లనే అనుసంధానించేందుకు అవకాశముందన్నారు. దీంతో అభ్యర్థుల సంఖ్య 95కు మించితే పాత రకం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించలేమన్నారు. కొత్త రకం ఈవీఎంలకు 24 బ్యాలెట్‌ యూనిట్లను అనుసంధానించే వీలుం దని, దీంతో 383 మంది అభ్యర్థులు పోటీ చేసినా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడానికి అవకాశముంటుందన్నారు. అయితే ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికలకు సంబంధించిన కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో వినియోగించిన కొత్త మోడల్‌ ఈవీఎంలను లోక్‌సభ ఎన్నికల్లో వాడలేకపోతున్నామన్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌లో పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్ని కలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. 

ప్రగతి భవన్‌లో రాజకీయ కార్యకలాపాలు వద్దు... 
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ప్రగతి భవన్‌లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని అధికార టీఆర్‌ఎస్‌కు లేఖ రాసినట్లు రజత్‌ కుమార్‌ తెలిపారు. ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, ప్రభుత్వ భవనాలకు వర్తించే ఎన్నికల నిబంధనలను అమలు చేయాలని ఎన్నికల సంఘం కోరిందన్నారు. నిజామాబాద్‌ స్థానానికి నామినేషన్లు వేయడానికి వచ్చిన రైతులను రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి బయటకు పంపించారని వచ్చిన ఫిర్యాదును పరిశీలించామని, అక్కడ ఓ వీఐపీ (సిట్టింగ్‌ ఎంపీ కవిత) నామినేషన్‌ వేయడానికి రావడంతో ఈ ఘటన జరిగిందని రజత్‌ కుమార్‌ తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద రైతులు గూమికూడి నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారని, అప్పుడే అక్కడికి వీఐపీ నామినేషన్‌ వేసేందుకు రావడంతో ఆమెకు మొదట అవకాశం కల్పించారని, రైతులను పక్కకు పంపించారని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇందులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన ఏమీ లేదన్నారు. నిజామాబాద్‌ సభలో ముఖ్యమంత్రి ‘హిందువు’పదాన్ని వినియోగించారని వచ్చిన ఫిర్యాదును పరిశీలించామని, అందులో సైతం ఎలాంటి ఉల్లంఘన ఉన్నట్లు తేలలేదన్నారు. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పరిధిలోకి వస్తుందా రాదా అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమకు విదేశాల్లో ఉన్న ఆస్తులను సైతం ప్రకటించాల్సిందేనని, లేకుంటే తీవ్రమైన తప్పిదం చేసినట్లు అవుతుందన్నారు. 

మరిన్ని వార్తలు