తెలంగాణలో మరో 17 పాజిటివ్‌ 

3 May, 2020 01:24 IST|Sakshi

కరోనాకు చికిత్స పొందుతూ ఒకరు మృతి

1,061కు చేరుకున్న కేసుల సంఖ్య

తాజాగా 35 మంది డిశ్చార్జి... 

మొత్తం కోలుకున్నవారు 499 మంది

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15, రంగారెడ్డి జిల్లాలో రెండు కేసులు రికార్డు అయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 1,061 కేసులు నమోదయ్యాయని, అందులో 29 మంది మరణించారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకొని తాజాగా 35 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, వారిలో హైదరాబాద్‌లో 24 మంది, సూర్యాపేట జిల్లాకు చెందిన నలుగురు, వికారాబాద్‌ జిల్లాకు చెందిన నలుగురు, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మంలలో ఒక్కొక్కరు ఉన్నట్లు వివరించారు. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 499 మంది డిశ్చార్జ్‌ అవగా 533 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.

మరోవైపు కేంద్రం లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించడం, కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పరీక్షలు చేయడం, బాధితులకు చికిత్స అందించడం ద్వారా వ్యాధి ముదరకుండా చూడాలని ఆదేశించారు. కంటైన్మెంట్‌ జోన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పరీక్షలు, చికిత్సలకు తరలించడం అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గాంధీలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను బలోపేతం చేయాలని, డయాలసిస్, కేన్సర్, టీబీ రోగులు, ఇతర దీర్ఘకాలిక జబ్బుల వారికి అసౌకర్యం లేకుండా చూడాలని, బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం కొరతను అధిగమించాలని సూచించారు. లక్ష కేసులు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని మంత్రి వివరించారు.  చదవండి: హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి ప్రమాణం 

యువకులపైనే ఎక్కువగా వైరస్‌ ప్రభావం... 
రాష్ట్రంలో కరోనా వైరస్‌ యువకులపైనే ఎక్కువ ప్రభావం చూపుతోందని హెల్త్‌ బులెటిన్‌లో వైద్య, ఆరోగ్యశాఖ విశ్లేషించింది. శనివారం వరకు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 21–40 ఏళ్ల వయసు వారే ఉన్నారు. ఆ వయసు వారిలో 40 శాతం మంది కరోనా బారిన పడ్డారు. అలాగే 41–60 ఏళ్ల వయసు వారిలో 29 శాతం మంది వైరస్‌ బారినపడినట్లు తెలిపింది. వైరస్‌ బారిన పడినవారిలో ఎక్కువగా పురుషులే ఉన్నారని, మొత్తం నమోదైన కేసుల్లో పురుషులు 705 (66.5%) మంది ఉండగా మహిళలు 356 (33.5%) మంది ఉన్నట్లు వివరించింది.  చదవండి: వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు 

>
మరిన్ని వార్తలు