కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కోవిడ్‌

12 Jun, 2020 09:21 IST|Sakshi

మానవాళిని కబళిస్తున్న కోవిడ్‌–19 నగరవాసులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూ సిటీజనులను బెంబేలెత్తిస్తోంది. ఎలాంటి ట్రావెలింగ్‌ హిస్టరీ లేకున్నా ఎవరినీ మహమ్మారి వదలడం లేదు. గ్రేటర్‌ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా గురువారం 175 మందికి కరోనా నిర్ధారణ కాగా.. తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు.

ఎల్‌బీనగర్‌: ఎల్‌బీనగర్‌ మూడు సర్కిళ్ల పరిధిలో గురువారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మన్సూరాబాద్‌లోని సహారా గేట్‌ వద్ద ప్రగతినగర్‌ కాలనీలో ఉండే ఓ ఎస్‌ఐకి కోవిడ్‌ సోకింది. సర్కిల్‌–5లోని అలేఖ్య టవర్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(36)కి, హస్తినాపురంలో నివాసముండే ఓ వ్యక్తి(42)కి, విజయదుర్గకాలనీలో నివాసముండే మరో వ్యక్తి(63)కి, కొత్తపేటలోని ప్రగతినగర్‌కాలనీలో నివాసముండే ఓ మహిళ(56)కు కరోనా నిర్ధారణ అయ్యింది.

నిజాంపేట్, బాచుపల్లిలో...
నిజాంపేట్‌: నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాచుపల్లిలోని ప్రణీత్, అంటిలియాలోని నారాయణ రెడ్డి అనారోగ్య కారణాలతో ఈ నెల 10న పరీక్ష నిర్వహించడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. నిజాంపేట్‌లోని శ్రీనివాస్‌ హౌసింగ్‌ సొసైటీ వీకే ఎన్‌క్లేవ్‌లో ఉండే కానిస్టేబుల్‌ సయ్యద్‌ మసూద్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

బడంగ్‌పేటలో...
బడంగ్‌పేట్‌: బడంగ్‌పేట మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర నగర్‌ కాలనీలో కరోనా కేసు నమోదైంది. రైల్వే మాజీ ఉద్యోగి(62) ఈ నెల 1న కిస్మత్‌పూర్‌లో ఉంటున్న కూతురు ఇంటికి తనతో పాటు భార్యను తీసుకెళ్లాడు. ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన భార్య బుధవారం రాత్రి బడంగ్‌పేటలోని రాఘవేంద్ర కాలనీకి చేరుకుంది. గురువారం ఉదయం ఆ ఇంటిని హోం క్వారంటైన్‌ చేశారు. కార్పొరేటర్‌ రాళ్లగూడం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, బాలాపూర్‌ వైద్యాధికారులు, మునిసిపల్‌ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో...
దుండిగల్‌: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో కరోనా బాధితుల సంఖ్య 67కు చేరింది. సూరారం రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళ(36)కు కోవిడ్‌తో మృతి చెందింది. రంగారెడ్డినగర్‌కు చెందిన వృద్ధుడు(83), బాలుడు(01), దూలపల్లిలోని అశోకా ‘ఏ’ లా మైసన్‌కు చెందిన వృద్ధుడు(80), సాయిబాబానగర్‌ శ్రీను బస్తీకి చెందిన వృద్ధురాలు(70), గాజులరామారం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి, మరో మహిళతో పాటు జీడిమెట్ల డివిజన్‌ దండమూడి ఎన్‌క్లేవ్‌కు చెందిన మహిళకు కోవిడ్‌ సోకింది.

మల్కాజిగిరి సర్కిల్‌లో...
నేరేడ్‌మెట్‌: మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారని మల్కాజిగిరి మున్సిపల్‌ డీసీ దశరథ్, నేరేడ్‌మెట్‌ వైద్యాధికారిణి రెడ్డికుమారి తెలిపారు. నేరేడ్‌మెట్‌ డివిజన్‌ సైనిక్‌పురి డిఫెన్స్‌కాలనీ చెందిన భార్యాభర్తలిద్దరూ తిరుమలగిరి, ఎస్‌ఆర్‌నగర్‌లలోని ఫైనాన్స్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. సైనిక్‌పురి డిఫెన్స్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో కూతురు(18)తో కలిసి నివసిస్తున్నారు. జ్వరంతో బాధపడుతుండటంతో ఫీవర్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. యాప్రాల్‌ పరిధిలోని జేజేనగర్‌కు చెందిన వ్యక్తికి(54) పాజిటివ్‌గా తేలడంతో కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మల్కాజిగిరి డివిజన్‌ పరిధిలోని ఓ పర్నీచర్‌ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న వ్యక్తి(58)కి కరోనా పాజిటివ్‌గా తేలింది.

అడ్డగుట్టలో...
అడ్డగుట్ట: అడ్డగుట్ట సీ సెక్షన్‌కు చెందిన ఓ మహిళ(40) కరోనా బారిన పడింది. కస్తూరిబా గాంధీ కాలేజీలో పని చేసే ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. కరోనా నిర్ధారణ అయ్యింది. ఆ మహిళను కింగ్‌ కోఠి ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త, ఇద్దరు పిల్లలను హోం క్వారంటైన్‌ చేశారు.

బోడుప్పల్‌లో...
బోడుప్పల్‌: బోడుప్పల్‌లో కొత్తగా మరో ఇద్దరు మహమ్మారి బారిన పడ్డారు. భవానీనగర్‌లోని ఓ వ్యక్తి(35)కి కరోనా పాజిటివ్‌గా అధికారులు నిర్ధారించారు. ఇతను ఎర్రగడ్డ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తాడు. మరో వ్యక్తి ద్వారకానగర్‌ ఫేజ్‌–2లోని ఓ వ్యక్తి (38)కి పాజిటివ్‌ అని తేలింది.

రామంతాపూర్‌లో...
రామంతాపూర్‌: శ్రీనివాస్‌పురంలో కొత్తగా మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. 48 ఏళ్ల ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారించారు.

మల్లాపూర్‌లో...
మల్లాపూర్‌: మల్లాపూర్‌ మల్లికార్జున్‌నగర్‌ కాలనీకి చెందిన గర్భిణి(29)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఓల్డ్‌ మల్లాపూర్‌కు చెందిన ఓ యువతి (25) బంజార్‌హిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పతిలో పనిచేస్తుంది. ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. 

హబ్సిగూడ బృందవన్‌కాలనీలో...
హబ్సిగూడ: బృందవన్‌కాలనీకి చెందిన బట్టల వ్యాపారి (48), అతని కూతురు (19)కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో...
ముషీరాబాద్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ముషీరాబాద్‌ గంగపుత్రకాలనీలోని 29 సంవత్సరాల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది. రాజా డీలక్స్‌ చౌరస్తా సమీపంలోని 49 సంవత్సరాల మహిళకు, పటాన్‌బస్తీలోని 49 సంవత్సరాల వ్యక్తికి కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది. భోలక్‌పూర్‌లోని బంగ్లాదేశ్‌ మార్కెట్‌ సమీపంలో నివసించే ఓ బాలింత(28)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

అంబర్‌పేటలో...
అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంలో గురువారం ఒక్క రోజే 26 కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. కుద్బిగూడ, సుందర్‌నగర్, కృష్ణానగర్, పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, అహ్మద్‌నగర్, తురాబ్‌నగర్‌ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రైమరీ కాంటాక్ట్స్‌తో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

బాలాపూర్‌ మండలంలో మటన్‌ వ్యాపారి మృతి
పహాడీషరీఫ్‌: బాలాపూర్‌ మండలంలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. జల్‌పల్లి మున్సిపాలిటీలోని శ్రీరాంకాలనీకి చెందిన మటన్‌ వ్యాపారి(40) వారం పది రోజులుగా పసకలతో బాధ పడుతున్నాడు.  జ్వరం, దగ్గు ఎక్కువగా ఉండటంతో రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం సాయంత్రం మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో జల్‌పల్లి చెరువు వద్ద అదే రోజు రాత్రి ఖననం చేశారు. కరోనా పాజిటివ్‌ కారణంగానే మృతి చెందినట్లు నివేదిక రావడంతో గురువారం పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ గోవిందరెడ్డి, స్థానిక కౌన్సిలర్‌ పల్లపు శంకర్, పహాడీషరీఫ్‌ ఎస్‌ఐ కుమార స్వామి, మున్సిపాలిటీ సిబ్బంది అక్కడికి చేరుకొని మృతుడి ఇంటి పరిసరాలలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించి, క్లోరిన్‌ పిచికారీ చేయించారు. మృతుడితో సన్నిహితంగా ఉన్న వారిని హోం క్వారంటైన్‌ చేసి ఆ ఇంటి పరిసరాలను కంటైన్మెంట్‌గా మార్చారు. మృతుడు ఆదివారం వరకూ మటన్‌ విక్రయాలు నిర్వహించడం...రెండు రోజుల క్రితమే స్థానిక సెలూన్‌లో క్షవరం చేయించుకున్న విషయాలు తెలుసుకొని... ఇతరులెవరికైనా వైరస్‌ సోకి ఉంటుందా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

బోయిన్‌పల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...
కంటోన్మెంట్‌: బోయిన్‌పల్లి చిన్నతోకట్టా హనుమాన్‌జీ సొసైటీలో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కరోనా బారిన పడి మరణించారు. కరోనా లక్షణాలతో శనివారం గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు తెలిసింది. ఉత్తర భారత్‌కు చెందిన సదరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబాన్ని హోం క్వారంటైన్‌ చేశారు.  

‘ఫీవర్‌’లో 25 కరోనా అనుమానిత కేసులు
నల్లకుంట: నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో గురువారం 25 కోవిడ్‌ అనుమానిత కేసులు నమోదయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరికి ఆస్పత్రి ఆవరణలోని హెల్ప్‌ డెస్క్‌లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్‌ లక్షణాలున్న వారిని ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం ఐసొలేషన్‌ వార్డులో 32 మంది అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

13 మందికి కోవిడ్‌ పాజిటివ్‌...
బుధవారం వచ్చిన 28 కోవిడ్‌ అనుమానితుల నుంచి సేకరించిన నమూనాల ల్యాబ్‌ రిపొర్ట్స్‌ గురువారం వచ్చాయి. అనుమానితుల్లో 13 మందికి పాజిటివ్‌ రావడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

చిలకలగూడ ఠాణా పరిధిలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
చిలకలగూడ: చిలకలగూడ ఠాణా పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. గడచిన రెండు రోజుల్లో ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. టీఆర్‌టీ క్వార్టర్స్, వారాసిగూడ దేనా బ్యాంకు గల్లీ, పద్మారావునగర్, శ్రీనివాసనగర్‌లో ఒక్కో కేసు, చిలకలగూడ మసీదుగల్లీ, బ్రాహ్మణబస్తీల్లో  రెండు చొప్పున కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. బాధితులు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రజలంతా తగిన జాగ్రత్తలు పాటించాలని జీహెచ్‌ఎంసీ, వైద్య అధికారులు సూచించారు. 

కరోనా బారిన ఎస్సార్‌నగర్‌ పోలీసులు
అమీర్‌పేట: ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్, ఏఎస్‌ఐ వైరస్‌ బారిన పడ్డారు. వారు ఆస్పత్రిలో చేరగా తాజాగా మరో ఇద్దరు పోలీసు సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. క్రైమ్‌ విభాగంలో పనిచేసే ఓ ఎస్‌ఐతోపాటు కోర్టు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స నిమిత్తం వారిని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి కోవిడ్‌ వార్డుకు తరలించారు.

బేగంబజార్‌లో కలకలం
అబిడ్స్‌: బేగంబజార్‌లో కరోనా కలకలం రేగింది. బేగంబజార్‌ ఛెత్రి చౌరస్తాలోని ఓ పేరుగాంచిన బట్టల దుకాణంలో మేనేజర్‌ స్థాయి అధికారి(40)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారం తెలుసుకున్న 20 రోజులుగా దుకాణంలో బటలు కొనుగోలు చేసిన వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఛెత్రి చౌరస్తాలో పేరుగాంచిన ఈ దుకాణానికి బేగంబజార్, చుడీబజార్, ధూల్‌పేట్, పురానాపూల్, గుల్షన్‌ హౌస్‌తోపాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. షాపులో మేనేజర్‌ స్థాయి ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రావడంతో సంబంధిత అధికారులు ఆ దుకాణాన్ని మూసివేశారు. పరిసర ప్రాంతాలను శానిటైజేషన్‌ చేశారు.

ట్రూప్‌ బజార్‌లో...
సుల్తాన్‌బజార్‌: ట్రూప్‌ బజార్‌లో ఎలక్ట్రికల్‌ వ్యాపారం చేసి భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఎస్‌ఐ చంద్రమోహ న్‌ సమాచారం మేరకు... ట్రూప్‌ బజార్‌ ఎలక్ట్రికల్‌ మార్కెట్‌లో 75 సంవత్సరాల వృద్ధుడు, అతని భార్య(65)కు జ్వరం, ఇతర సమస్యలతో ఉండటంతో ఈ నెల 9న యశోద ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అందులో వారికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులైన కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలను హోం ఐసొలేషన్‌లో ఉంచారు.    

కింగ్‌కోఠి ఆస్పత్రిలో 26 పాజిటివ్‌ కేసులు
సుల్తాన్‌బజార్‌: కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో 26 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆస్పత్రి ఇంచార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. 302 మంది కరోనా లక్షణాలతో ఆస్పత్రికి పరీక్షలు నిమిత్తం వచ్చారు. అందులో 40 మందికి కరోనా టెస్ట్‌లు చేశామని తెలిపారు. 38 మందిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నామన్నారు. గతంలో పరీక్షలు నిర్వహించిన వారిలో 9 మందికి నెగిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతం 15 కేసులను హోం ఐసొలేషన్‌ చేశామని తెలిపారు. 

ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో...
ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో మరోసారి కరోనా పంజా విసిరింది. ఇద్దరు వైద్య విద్యార్థుల నుంచి ప్రారంభమైన కరోనా కేసులు దాదాపు 40 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో, అందులో ఉన్న 200కు పైగా వైద్య విద్యార్థులకు వైద్యులు కరోనా టెస్ట్‌లు చేశారు. తాజాగా గురువారం ఉస్మానియా మెడికల్‌ కళాశాలలోని ఐదుగురికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.  

ఓయూలో కరోనా టెన్షన్‌
ఉస్మానియా యూనివర్సిటీ: కరోనా మహమ్మారి బారిన పడి ఓ ఉద్యోగి మృతి చెందడంతో ఓయూలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎన్‌జీవోస్, టెక్నికల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డిని కలిసి కరోనా ఉదృతి తగ్గేవరకు ఉద్యోగులందరికీ సెలవులు ప్రకటించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. టెక్నాలజీ కళాశాలలో కామాటి పర్మినెంట్‌ ఉద్యోగి ప్రకాష్‌రావు(54) కరోనాతో మృతి చెందటంతో ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. ఆర్ట్స్‌లో పని చేసే మరో ఉద్యోగి బంధువుకు కరోనా సోకి మృతి చెందడంతో ఆయనను విధులకు రావద్దని ఆదేశించారు. ఓయూ పోలీసు స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుల్‌లకు కరోనా సోకిన విషయం విదితమే.  ఓయూ క్యాంపస్‌తో పాటు అనుబంధ కళాశాలల్లో పర్మినెంట్, కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగులు సుమారు 5 వేల వరకు ఉంటారు. వీరు నగరంలోని పలు ప్రాంతాలలో నివసిస్తూ ఓయూ కళాశాలలు, కార్యాలయాలు, గార్డెన్, ప్రయోగశాలలో విధులు నిర్వహిస్తుంటారు. ఆయా ప్రాంతాలలో నుంచి వచ్చే ఉద్యోగులు నగరంలో కరోనా ఉదృతి పెరగటంతో భయాందోళన చెందుతున్నారు. దీంతో ఉద్యోగులందరూ కరోనా నియంత్రణ అయి లాక్‌ డౌన్‌ ఎత్తివేసే వరకు అత్యవసర సర్వీసులు మినహా ఇతర ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల నిర్ణయంపై ఓయూ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరిన్ని వార్తలు