ఔను.. ఇది కిరోసిన్‌ ఫ్రిడ్జ్‌

19 Jul, 2019 09:10 IST|Sakshi
తన ఇంట్లోని కిరోసిన్‌ ఫ్రిడ్జ్‌ని చూపుతున్న మీర్‌ యూసుఫ్‌ అలీ

175 ఏళ్ల క్రితం ఫ్రాన్స్‌లో తయారీ  

అప్పుడే నగరానికి దిగుమతి 

ఇప్పటికీ పాతబస్తీలో వినియోగం

సాక్షి సిటీబ్యూరో: నిజాం పాలనలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే నూతన టెక్నాలజీని నగరానికి తెప్పించేవారు. అవి హైదరాబాద్‌ సంస్థాన పాలకులు, నవాబులు, ధనికుల ఇళ్లలోకి చేరేవి. ఆలాంటి వాటిలో ఫ్యాన్లు, విద్యుత్‌ పరికరాలు, వాహనాలు, షాండ్లియార్లు వంటివి ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు ఇతర దేశాల్లో తయారయ్యే విలాస వస్తువులు మన దేశంలో తొలుత నగరానికే వచ్చేవి. ఇలాంటి వాటిలో ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ‘కిరోసిన్‌ రిఫ్రిజిరేటర్‌’ కూడా ఉంది. కిరోసిన్‌ రిఫ్రిజిరేటరేంటి..! అలాంటిది కూడా ఒకటుందా..!! అని ఆశ్చర్యపోవద్దు. తొలినాళ్లలో రిఫ్రిజిరేటర్‌ విద్యుత్‌తో కాకుండా కిరోసిన్, నూనెతో పనిచేసేవి. ఆ నాటి ఆ రిఫ్రిజిరేటర్‌ ఇప్పటికీ పాతబస్తీలోని ఓ ఇంట్లో వాడుకలో ఉంది.

ఈ రిఫ్రిజిరేటర్‌ వాడకం కూడా చాలా సులువు. అవసరాన్ని బట్టి దీపాన్ని ఎక్కువ,తక్కువగా మండిస్తే చాలు కావాల్సినంత గ్యాస్‌ ఉత్పత్తి అవుతంది. ఇందులో ఉంచిన పదార్థాలు అంతే తొందరగా చల్లాబడతాయి. పైగా నిర్వహణ కూడా చాలా తేలిక.

ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి
కిరోసిన్‌ రిఫ్రిజిరేటర్‌ను ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త ఫెర్డినాండ్‌ కారే 1858లో కనుగొన్నాడు. ఫ్రిజ్‌ కింది భాగంలో ఓ పెట్టె ఉంది. ఇందులో కిరోసిన్‌ పోసి దాని కింది భాగంలోని ఓ చివర దీపం వెలిగిస్తారు. దాన్నుంచి వెలువడే వేడితో నీరు, సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని మండిస్తే వెలువడే గ్యాస్‌ ఫ్రిజ్‌ వెనుక భాగంలో అమర్చిన పైపుల ద్వారా లోపలికి ప్రవేశించడంతో అందులోని పదార్థాలను చల్లగా ఉంటాయి.  

నగరంలోనే అరుదుగా..
నిజాం కాలంలో నగరంలోని ధనికులు ఈ రిఫ్రిజిరేటర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. 1980 వరకు పాతబస్తీలోని పలు నివాసాల్లో ఇలాంటి ఫ్రిడ్జిలు ఎక్కువగా వినియోగించే వారు. విద్యుత్‌ రిఫ్రిజిరేటర్లు వచ్చాక వీటి వినియోగం తగ్గింది. తమ ఇంటిలో పదేళ్ల క్రితం వరకు ఇలాంటి కిరోసిన్‌ ఫ్రిడ్జ్‌ వినియోగించారని జహీరానగర్‌ నివాసి ముజాహిద్‌ తెలిపారు. కూలింగ్‌ ఎక్కువ కావాలంటే దీపాన్ని పెద్దగా> మండించేవారని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.  

175 ఏళ్లుగా సేవలు
19వ శతకంలో తయారైన ఈ కిరోసిన్‌ రిఫ్రిజిరేటర్‌ను నేను సంపాదించాను. ఆ రోజుల్లో విద్యుత్‌ అందుబాటులో లేని ప్రాంతాలు, మిలటరీ క్యాంపుల్లో ఆహారం నిల్వ ఉంచేందుకు వీటిని వాడేవారు. ఇప్పటికీ ఇది అద్భుతంగా పనిచేస్తోంది.– మీర్‌ యూసుఫ్‌ అలీ, జహీరానగర్‌

మరిన్ని వార్తలు