నిజామాబాద్‌ ఎన్నిక వాయిదా?

29 Mar, 2019 03:24 IST|Sakshi

ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం 

సీఈఓ రజత్‌కుమార్‌ స్పష్టీకరణ

185 మంది బరిలో ఉండడమే కారణం

 పరిస్థితులను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తాం 

షెడ్యూల్‌ పొడిగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో అక్కడ ఎన్నికల షెడ్యూల్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ వెల్లడించారు. షెడ్యూల్‌ మేరకు నిజామాబాద్‌లో ఎన్నికల నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ స్థానానికి ఎన్నికలను షెడ్యూల్‌ మేరకే నిర్వహించాలా? లేదా ప్రత్యేకంగా ఆ ఒక్క స్థానానికి సంబంధించిన షెడ్యూల్‌ను పొడిగించాలా? అన్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.

185మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఈవీఎంలకు బదులుగా పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, అవసరమైన బ్యాలెట్‌ బాక్సుల సమీకరణపై దృష్టిసారించామన్నారు. 185మంది అభ్యర్థుల పేర్లతో ఒకే బ్యాలెట్‌ పత్రాన్ని ముద్రించాలా? లేక నాలుగైదు బ్యాలెట్‌ పత్రాల్లో 185 మంది పేర్లను ముద్రించాలా? అన్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సలహాలు తీసుకుంటామన్నారు. అధిక పరిమాణంలో బ్యాలెట్‌ పత్రాలు ఉండనుండడంతో వాటికి తగిన పరిమాణంలో బ్యాలెట్‌ బాక్కులను సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. అ అంశాలపై సమీక్ష జరుపుతున్నామని, రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. 185 మంది అభ్యర్థులకు సరిపడే సంఖ్యలో ఎన్నికల గుర్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. 

కేసీఆర్‌పై ఫిర్యాదును పరిశీలిస్తున్నాం 
మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్‌ అనే రైతుకు సంబంధించిన భూవివాదాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి ఆ రైతుతో ఫ్లోన్లో మాట్లాడి.. కలెక్టర్‌ను రంగంలోకి దించి రైతుబంధు చెక్‌ ఇవ్వడంతోపాటు సమస్యను పరిష్కరించడంపై ఫిర్యాదులు అందాయని రజత్‌కుమార్‌ తెలిపారు. ఆ టెలిఫోన్‌ సంభాషణను విడుదల చేయడం కూడా రాజకీయ ప్రచారమేనని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రచారం కోసం అధికార యంత్రాంగాన్ని రాజకీయ నేతలు వినియోగించడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రిగా పరిపాలనను పర్యవేక్షించవచ్చని, రాజకీయ అవసరాల కోసం అధికారాన్ని వినియోగించకూడదన్నారు. సీఎంతో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్‌పై అందిన ఫిర్యాదులను పరిశీలన కోసం ఎన్నికల ప్రవర్తన నియమావళి కమిటీకి పంపించామన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి సైతం తీసుకువెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. ఒక వేళ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్లు తేలితే ఉల్లంఘించిన వారితో పాటు అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు