ఎర్రగడ్డ ఆస్పత్రికి పోటెత్తిన రోగులు

1 Apr, 2020 07:58 IST|Sakshi
రోగులను ఆస్పత్రికి తీసుకొస్తున్న బంధువులు

మద్యం దొరక్క మానసిక అశాంతిలో మందుబాబులు

మంగళవారం ఓపీకి 198 మంది రోగులు

97 మందికి అత్యవసర చికిత్స

వెంగళరావునగర్‌: కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్‌ ఫలితంగా మద్యం అందుబాటులో లేని కారణంగా మద్యానికి బానిసైన వారి పరిస్థితి రోజురోజుకూ దుర్భరంగా తయారవుతోంది. క్రమంగా మతిస్థిమితం లేని వారిలా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో వారిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు మంగళవారం 198 మంది ఔట్‌ పేషెంట్లు హాజరైనట్టు సూపరింటెండెంట్‌ ఉమాశంకర్‌ తెలిపారు.

ఆస్పత్రిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 198 మంది ఓపీకి రాగా 101 మందికి వైద్యం చేయించి పంపించామన్నారు. మరో 97 మందిని ఎమర్జెన్సీగా గుర్తించి ఆస్పత్రిలోనే ఉంచి వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మద్యం తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో అనేకమంది ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. మద్యానికి బానిసలైన వారికి ఒక్కసారిగా మద్యం దొరక్క పోవడం వల్ల పిచ్చిపట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే వారికి చికిత్సలు చేసిన అనంతరం అతి త్వరలోనే మామూలుగా ఉంటారని, పూర్తిగా దీనిని నయం చేయవచ్చని సూచించారు. మద్యాన్ని పూర్తిగా మాన్పించి వేయాలని కుటుంబ సభ్యులకు  సూచిస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు