ఇది ప్రజాస్వామ్య అపహాస్యమే!

4 Mar, 2019 02:28 IST|Sakshi

డబ్బు మూటలతో మా ఎమ్మెల్యేలను కొంటారా?

టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: గులాబీ పార్టీ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’పై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రం లో రాజ్యాంగ సంక్షోభానికి కేసీఆర్‌ కారణమవుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. రెండోసారి అధికారం చేపట్టాక సీఎం పార్టీ ఫిరాయింపులను మరీ దారుణంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. ఈ అంశంపై స్పీకర్‌తోపాటు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నామంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌)ల ప్రకటన నేపథ్యంలో.. ఆదివారం సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది.

ఈ సమావేశానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమా ర్క, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, శ్రీధర్‌బాబు, సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పొడెం వీరయ్య, సురేం దర్, హర్షవర్దన్‌రెడ్డి, హరిప్రియా నాయక్, పైలట్‌ రోహిత్‌రెడ్డిలు హాజరయ్యారు. అనారోగ్య కారణాల తో పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి రాలేకపోయారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో వీరంతా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు.

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లడంపై పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చినట్టు తెలిసింది. వీరిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలనే నిర్ణయాన్ని సీఎల్పీ ఖండించింది. గతంలోనూ సీఎం కేసీఆర్‌ ఇదే విధం గా వ్యవహరించారని, ఇప్పుడు మళ్లీ దాన్నే కొనసాగిస్తున్నారని మండిపడింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే రాజకీయాల్లో నైతికత లేకుండా పోతుందనే అభిప్రాయాన్ని సమావేశం వ్యక్తం చేసింది. ఈ అంశంపై నిరసన తెలిపేందుకు ఎమ్మెల్యేలంతా ప్రగతిభవన్‌ వద్దకు వెళ్లడంపై చర్చ జరిగినా చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు.

వారి ఓటు హక్కు తొలగించాలి
రేగా కాంతారావు, ఆత్రం సక్కుఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయకుండా చూడాలని సీఎల్పీ సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ నెల 5, 6, 8 తేదీల్లో సమావేశాలు, నిరసనలు తెలపాలని నిర్ణయించారు. ఈ నెల 5న ఆసిఫాబాద్, పినపాక నియోజకవర్గాల కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని, 6న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని, 8న పార్టీ ఎమ్మెల్యేలంతా పినపాక, ఆసిఫాబాద్‌లకు వెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించారు.

గాంధీ విగ్రహం ముందు ధర్నా
సీఎల్పీ సమావేశం అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం సమీపంలో ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయింపులు, కేసీఆర్‌ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపులు రాజ్యాం గ వ్యతిరేక చర్య అని, కేసీఆర్‌ రాజకీయ వికృత క్రీడ జుగుప్సాకరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి కేసీఆర్‌ కారణమవుతున్నారని ఆరోపించారు. పోడుభూములపై గిరిజనులకు హక్కులిచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి కాంతారావు, సక్కులు ద్రోహం చేశారని, గిరిజనుల నుండి భూములు లాక్కున్న కేసీఆర్‌ దగ్గరకెళ్లారని విమర్శించారు. వారిద్దరిపై రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ సీఎం అయ్యాక తెలంగాణ అన్యాయాలకు, అక్రమాలకు వేదికయిందని ఆరోపించారు. రెండోసారి సీఎం అయ్యాక ఆయన రాజనీతిజ్ఞుడుగా వ్యవహరిస్తారని అనుకున్నామని, మొదటిదఫాలో చేసినట్లుగా చిల్లర రాజకీయాలు చేయరని భావించామన్నారు.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికల్లో సంప్రదాయాల కోసమే టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామని, కానీ, కేసీఆర్‌ మాత్రం వికార, వికృత రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న కేసీఆర్‌ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, కేసీఆర్‌ రంగులు మార్చే ఊసరవెల్లి అని అన్నారు. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలిచ్చి కాం గ్రెస్‌ లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్యలు మాట్లాడుతూ.. ఆదివాసీలను గుర్తించింది కాంగ్రెస్‌ పార్టీయేనని, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యవహరించారని విమర్శించారు. 

మధ్యలో వెళ్లిపోయిన రాజగోపాల్‌
తన నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత ఒకరు మరణించడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. అంతకుముందు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని.. తాను పార్టీ మారతాననే ఆలోచనే అవసరం లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకత్వంతోనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్తుంటే జోష్‌ రావడం లేదని.. అయినా లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు