‘మండలి’ మెట్లెక్కేదెవరు?

28 Feb, 2019 04:39 IST|Sakshi

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు 20 మంది వరకు పోటీ

కరీంనగర్‌ నుంచి బరిలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి 

తమ అభ్యర్థిగా రఘోత్తంరెడ్డిని పోటీలో నిలిపిన పీఆర్‌టీయూ

నల్లగొండ నుంచి పీఆర్‌టీయూ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రవీందర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోటీకి సై అంటే సై అంటూ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నేతలు ముందుకు వస్తున్నారు. పీఆర్‌టీయూ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తోపాటు ఇదే యూనియన్‌లో పని చేసి బయటకు వచ్చిన నేతలూ పోటీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా పీఆర్‌టీయూ వ్యవస్థాపకుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఇటీవల ఈ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పులి సరోత్తంరెడ్డి బరిలో ఉన్నారు. ఖమ్మంలో పీఆర్‌టీయూ సిట్టింగ్‌ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆ జిల్లా కమిటీ తీర్మానం చేసింది. అయితే సంఘం నేతల ఒత్తిడితో చివరకు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. మరోవైపు నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు పోటీకి సిద్ధమై వెనక్కి తగ్గారు. ఇద్దరు సిట్టింగ్‌ అభ్యర్థులు తమ పార్టీ వారే అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకుండా ఈ ఎన్నికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

ముఖ్య నేతల మధ్య పోటాపోటీ..
నల్లగొండ–ఖమ్మం–వరంగల్, కరీంనగర్‌–మెదక్‌–నిజమాబాద్‌–ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూలు కూడా వచ్చింది. ఆయా స్థానాల నుంచి పోటీ పడుతున్న ముఖ్య నేతలు 16 మంది వరకు ఉండగా, అందులో ప్రధాన పోటీ పీఆర్‌టీయూకు సంబంధించిన అభ్యర్థుల మధ్యే ఉండే అవకాశం ఉంది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ స్థానం నుంచి పోటీలో నిలిపేందుకు పూల రవీందర్‌కు పీఆర్‌టీయూ మద్దతు ప్రకటించగా, ఇక్కడి నుంచి సరోత్తంరెడ్డి కూడా పోటీకి సిద్ధమయ్యారు. అలాగే మరో ప్రధాన సంఘమైన యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేసిన ఎ.నర్సిరెడ్డి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) తరఫున పోటీలో ఉంటున్నారు.

మరోవైపు ఇతర సంఘాల నుంచి కలుపుకొని మొత్తంగా 13 మంది పోటీలో ఉండేందుకు సిద్ధమయ్యారు. పీఆర్‌టీయూ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నర్సింహారెడ్డి బరిలో ఉన్నారు. అయితే బుధవారం టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల చర్చల నేపథ్యంలో పూల రవీందర్‌కు మద్దతుగా నర్సింహారెడ్డి పోటీ చేయకుండా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ స్థానంలో ప్రధాన పోటీ రవీందర్, సరోత్తంరెడ్డి, నర్సిరెడ్డి మధ్యే ఉండే అవకాశాలున్నాయి. వీరే కాకుండా టీటీఎఫ్, ఆటా అభ్యర్థిగా ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ తాటికొండ వెంకటరాజయ్య, రిటైర్డ్‌ డీఈవో చంద్రమోహన్, కేయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సంగాని మల్లేశం, పారుపల్లి సురేషన్, కొత్తపల్లి గురుప్రసాద్‌రావు పోటీలో ఉన్నారు. ఇప్పు డు వారంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

పీఆర్‌టీయూ జీవం పోసిన ఆ ఇద్దరు..
పీఆర్‌టీయూ వ్యవస్థాపక నేతల్లో ముఖ్యులు బత్తాపురం మోహన్‌రెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి. ఇప్పుడు వారిద్దరు కరీంనగర్‌–మెదక్‌–నిజమాబాద్‌– ఆదిలాబాద్‌ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. పీఆర్‌టీయూను వీడి మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, సుధాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. పీఆర్‌టీయూ తమ అభ్యర్థిగా ఆ సంఘం సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు కె.రఘోత్తంరెడ్డికి మద్దతు ప్రకటించగా ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సుధాకర్‌రెడ్డికి మద్ద తివ్వాలని టీఆర్‌ఎస్‌ అడిగితే రఘోత్తంరెడ్డిని ఆపే అవకాశాలున్నాయి. ఈ స్థానం నుంచి యూఎస్‌పీసీ అభ్యర్థిగా కొండల్‌రెడ్డి, ఎస్టీయూ అభ్యర్థిగా సుధాకర్‌రెడ్డి, టీటీఎఫ్‌ అభ్యర్థిగా సీహెచ్‌ రాములు, టీపీటీయూ అభ్యర్థిగా వేణుగోపాలస్వామి పోటీలో ఉన్నారు.

వ్యూహాత్మకంగా టీఆర్‌ఎస్‌
ఈ రెండు స్థానాల్లోనూ సిట్టింగ్‌లు ఇద్దరూ టీఆర్‌ఎస్‌ పార్టీ వారే అయినా ఆ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ పేరుతో అభ్యర్థులను నిలబెట్టకూడదన్న నిర్ణయంతో టీఆర్‌ఎస్‌ ఉన్నట్లు తెలిసింది. అయితే అనధికారికంగా మాత్రం వారికి మద్దతును కూడగట్టే ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే నల్లగొండలో కె. నర్సింహారెడ్డి పోటీలో ఉండకుం డా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇక కరీంనగర్‌ స్థానం నుంచి కూడా ఒకరిద్దరిని పోటీ నుంచి తప్పుకునేలా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు