ఓ పల్లె.. 20 సీసీ కెమెరాలు

6 May, 2018 01:18 IST|Sakshi
అయినాపూర్‌ గ్రామం

సిద్దిపేట జిల్లా అయినాపూర్‌లో సీసీటీవీ భద్రత..

అఘాయిత్యాల వేళ’ స్పందించిన యువత

గ్రామ భద్రతపై వాట్సాప్‌ వేదికగా చర్చోపచర్చలు 

ప్రభుత్వ సాయం కోసం చూడక స్వచ్ఛందంగా ముందుకు 

అయినాపూర్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం పేరుతో విరాళాలు 

పదిహేను రోజుల్లోనే కెమెరాలు సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌ : ఉన్మాదులు రెచ్చిపోతున్నారు.. ముక్కుపచ్చలారని చిన్నారులను కాటేస్తున్నారు.. వీటికి తోడు దొంగల బెడద.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అడుగడుగునా పోలీసులున్న పట్టణాల్లోనే లెక్కలేనన్ని ఘోరాలు జరుగుతుంటే మరి నిఘాలేని పల్లెల పరిస్థితేంటి? అక్కడ రక్షణ మాటేమిటి? ఇదే అంశం ఆ ఊరి యువతను కునుకు లేకుండా చేసింది. పోలీసు ఔట్‌ పోస్టు కూడా లేని తమ ఊరి భద్రతపై వారిలో అలజడి మొదలైంది. వెంటనే స్పందించి వాట్సాప్‌ వేదికగా సమాచారం చేరవేశారు.. చర్చోపచర్చలు జరిపారు.. పక్షం రోజులైంది.. కట్‌ చేస్తే ఇప్పుడా ఊరికి 20 సీసీ కెమెరాలతో నిఘా.. ఇది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్‌ గ్రామ యువత ‘నిఘా’గాథ.  

4 వేల జనాభా.. 
సుమారు 4 వేల జనాభా ఉన్న అయినాపూర్‌ గ్రామం విద్యాధికులకు నిలయం. ఇక్కడి యువకులు అనేకమంది సాఫ్ట్‌వేర్‌ సహా ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులుగా ఇతర గ్రామాల్లో పని చేస్తున్నారు. అయితే ఇటీవల తరచూ వార్తల్లో కనిపిస్తున్న అవాంఛనీయ ఘటనలతో గ్రామస్తులు ఆందోళన చెందుతుండటం.. చీకటి పడగానే తలుపులు వేసుకుంటుండటం గమనించిన ఆ ఊరి యువత ఆలోచనలో పడ్డారు. గ్రామ భద్రత విషయమై కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై సతీశ్‌కుమార్‌తో చర్చించారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛందంగా సీసీటీటీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.  

వారంలో రూ.70 వేలు.. 
ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని నేరుగా సంప్రదించడం జాప్యమవుతుందని తాము నిర్వహిస్తున్న అయినాపూర్‌ సన్‌రైజర్స్, అయినాపూర్‌ ఫ్రెండ్స్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో అభిప్రాయాలు పంచుకున్నారు. ఇందుకు అందరి నుంచీ ఆమోదం లభించడంతో వెంటనే అయినాపూర్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం పేరుతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని విరాళాల సేకరణ మొదలెట్టారు. గ్రూపు సభ్యులు మహిపాల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, అశోక్, వూడెం జైపాల్‌రెడ్డి, కాయిత జైపాల్‌రెడ్డి, యాదగిరి, శ్రీధర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, జిల్లా రవీందర్, మురళీధర్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, చెంబురెడ్డి, సంజీవ్‌రెడ్డి తదితరులు తొలుత విరాళాలు ఇవ్వడంతో మిగతావారు కూడా ముందుకొచ్చారు. వారం రోజుల్లో రూ.70 వేలు జమవడంతో తొలుత కొన్ని కెమెరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.  

తొలి విడత 9 కెమెరాలు 
గ్రామ భద్రతపై సర్పంచ్‌ పబ్బోజు విజయేందర్‌ కూడా స్పందించారు. మరిన్ని కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఇదే గ్రామానికి అనుబంధంగా ఉన్న రసూలాబాద్‌ను కూడా కలుపుకొని 20 కెమెరాలును ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తొలివిడత 9 కెమెరాలు కొనుగోలు చేసి శనివారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో చేర్యాల సీఐ రఘు, కొమురవెల్లి ఎస్‌ఐ సంతోశ్‌కుమార్‌లకు అందించారు. మిగిలిన కెమెరాలను మరో వారం రోజుల్లో సిద్ధం చేయనున్నారు. అలాగే ఇటీవలి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 11 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.1,000 చొప్పున నగదు బహూకరించారు. ఇలా సిద్దిపేట జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి గ్రామం అయినాపూర్‌.  
 

మరిన్ని వార్తలు