పాలమూరు యూనివర్సిటీకి బంపర్‌ ఆఫర్‌

19 Sep, 2019 08:24 IST|Sakshi
పాలమూరు యూనివర్సిటీ ముఖద్వారం

రాష్ట్రంతో పాటు, కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల  

తాజాగా రూ.20 కోట్ల రూసా నిధుల కేటాయింపు  

50శాతం నిర్మాణాలకు, 50శాతం అకాడమిక్‌ డెవలప్‌మెంట్‌ కోసం వినియోగం 

వివిధ అభివృద్ధి పనులకోసం ప్రతిపాదనలు 

న్యాక్‌ గుర్తింపుతో పీయూ చరిత్రలో కీలక మలుపు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: వెనుకబడిన పాలమూరు జిల్లాలో అక్షర జ్యోతులు వెలిగించాలన్న ఉద్దేశ్యంతో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పాలమూరు యూనివర్సిటీ దినదినాభివృద్ధి చెందుతోంది. పదేళ్లనుంచి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులతో సర్దుకుపోతుండగా ఇప్పడు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వచ్చేందుకు ద్వారాలు తెరుచుకున్నాయి. రాష్ట్రీయ ఉచ్చాచితర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) కింద కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.20 కోట్ల నిధులను కేటాయించింది.

 
న్యాక్‌ గుర్తింపుతోనే.
పాలమూరు యూనివర్సిటీకి నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌంన్సిల్‌ (న్యాక్‌)  గుర్తింపు వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే పీయూకు న్యాక్‌లో పీయూ 2.31 స్కోర్‌ చేయడంతో బీ గ్రేడ్‌ను సొంతం చేసుకుంది. పీయూతో పాటు ఇదే గ్రేడింగ్‌ సాధించిన మహాత్మాగాందీ యూనివర్సిటీ, నల్లగొండకు కూడా ఇవే నిధులుకేటాయించింది. అయితే సాధారణంగా రూసా నిధులు మంచి గ్రేడింగ్‌ వచ్చిన యూనివర్సీటీలకు మాత్రమే కేటాయిస్తుండగా ఈ సంవత్సరం సాధారణ గ్రేడింగ్‌ సాధించిన యూనివర్సిటీలకు నిధులను కేటాయిస్తే త్వరతగతిన అభివృద్ధి సాధిస్తారని భావించి ఈ నిధులను కేటాయించినట్లు తెలిసింది.
 
పెరగనున్న వసతులు 
సాధారణంగా యూనివర్సిటీలకు న్యాక్‌ గుర్తింపు వస్తే వసతులు పెరిగి మెరుగైన విద్య, వసతుల అభివృద్ధి సాధిస్తే రాష్ట్రీయ ఉచ్చాచితర్‌ శిక్షా అభియాన్, న్యాక్, కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి ప్రత్యేక నిధులు అందుతాయి. వీటిలో యూనివర్సిటీలో నాణ్యత, ప్రమాణాల ఆధారంగా ఏ,బీ,సీ వంటి గ్రేడులను ఆధారం చేసుకుని నిధులు అందిస్తుంది. 2016లో బాధ్యతలు స్వీకరించిన యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ రాజరత్నం కృషి ఎంతో ఉందని, అ«ధికారులు, విద్యార్థులు అభిప్రాయ పడుతున్నారు. న్యాక్‌ గుర్తింపు కోసం వసతుల కల్పన, విద్యలో నాణ్యత, భవనాల నిర్మాణం వంటి అనేక అంశాలపై ఆయన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని, పకడ్బందీగా న్యాక్‌ దరఖాస్తు చేయడంతో ఈ నిధులు వచ్చినట్లు తెలుస్తోంది. న్యాక్‌ బృందం పీయూలోని వివిధ వసతులను పరిశీలించేందుకు 2018 సెప్టెంబర్‌ 18న పీయూను సందర్శంచి, మూడురోజుల పర్యటన చేశారు. అనంతరం 2019 ప్రారంభంలో న్యాక్‌ గుర్తింపు ఇస్తూ బి–గ్రేడ్‌ను కేటాయిస్తూ ప్రకటన జారీ చేశారు. ఇందులో బీ గ్రేడ్‌ వచ్చిన కళాశాలలకు నిధులు వచ్చేందుకు అవకాశం ఉంది. 

శాతాల వారీగా నిధుల వినియోగం 
న్యాక్‌ గ్రేడింగ్‌ వచ్చిన కళాశాలలకు నిధులు కేటాయించే క్రమంలో వీటిని వినియోగానికి సంబంధించి కచ్చితమైన పరిధులు ఉంటాయి. ఇందులో అకాడమిక్‌ డెవలప్‌మెంట్‌ నుంచి ఇఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ వరకు ప్రతిఅంశం కూడా రూసా నిబంధనల మేరకు మాత్రమే వినియోగించాల్సి ఉంటంది. మొత్తం రూ.20 కోట్లలో 50 శాతం నిధులు యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులు, వివిధ భవనాల నిర్మాణం, చేపట్టేందుకు కేటాయించాల్సి ఉంది. 20శాతం నిధులను యూనివర్సిటీలోని గతంలో నిర్మించిన  వివిధ భవనాలకు రీపేర్లు చేసేందుకు కేటాయించాలి. 20 శాతం నిధులు డిపార్ట్‌మెంట్‌ల వారీగా విద్యార్థులకు అవసరమయ్యే ఎక్యూప్‌మెంట్‌ కోసం కేటాయించాలి. 10 శాతం నిధులు సైన్స్‌ విధులు చేసే ప్రయోగాల కోసం వినియోగించే కెమికల్స్‌ కోసం కేటాయించాల్సి ఉంటుంది.
 
రూ.20 కోట్ల ఖర్చుకు ప్రతిపాదనలు 
నిధుల కేయింపునకు ముందు ప్రభుత్వం అందుకు సంబంధించి ప్రతిపాదనలను యూనివర్సిటీ అధికారుల నుంచి కోరుతుంది. పీయూ అధికారులు కూడా చేపట్టబోయే పనులకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించారు. ఇందులో మొదటగా యూనివర్సిటీలో చదువుతున్న బాలికలు, ఆర్ట్స్, సైన్స్, ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థునులు ఒకే హాస్టల్లో సంఖ్యకు మించి ఉంటున్నారు. బాలికలకు నూతన భవనం నిర్మించనున్నారు. అంతేకాకుండా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు, సిబ్బంది ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఆస్పత్రి నిర్మాణం కూడా చేయనున్నారు. వీటితో పాటు  ప్రస్తుతం ఉన్న సైన్స్, ఆర్ట్స్‌ అకాడమిక్‌ భవనాలతో పాటు అధనంగా మరో అకాడమిక్‌ బిల్డిండ్‌ నిర్మించనున్నారు. విద్యార్థులకు ఆడుకునేందుకు సౌకర్యంగా రన్నింగ్‌ ట్రాక్, ఫుట్‌బాల్‌ గ్రౌండ్, ఫీల్డ్‌ ట్రాక్‌లు నిర్మించనున్నారు. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరం నుంచి రీసెర్చ్‌కు సంబంధించి పెద్ద సంఖ్యలో స్కాలర్స్‌ను భర్తీ చేయనున్నారు. అందుకోసం వివిధ డిపార్ట్‌మెంట్‌ల వారీగా రీసెర్చ్‌ ఎక్యూప్‌మెంట్, ల్యాబ్‌లను పెద్ద ఎత్తున సమకూరుస్తారని తెలుస్తోంది. వీటితో పాటు పీయూకు అనుబంధ పీజీ సెంటర్లలో కూడా వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
  
అందరి సహకారంతోనే.. 
పాలమూరు యూనిర్సిటీ ప్రతి సంవత్సరం కొత్త పంథాను అనుసరిస్తోంది. అందుకు ప్రధాన కారణం యూనివర్సిటీ అధికారుల సమిష్టి కృషియే. ప్రస్తుతం ఉన్న న్యాక్‌–బీ గ్రేడ్‌ ద్వారా వచ్చిన నిధుల ద్వారా పీయూను మరింత అభివృద్ధి చేసి భవిష్యత్‌లో ఏ–గ్రేడ్‌ సా«ధించే విధంగా కృషిచేస్తూ రాష్ట్రంలోనే మంచి యూనివర్సిటీగా పీయూ పేరును నిలబెడతాం.  – పిండి పవన్‌కుమార్, పాలమూరు యూనివర్సిటీ, రిజిస్ట్రార్‌ 
నిధులు రావడం సంతోషకరం  
పాలమూరు యూనివర్సిటీ ఇప్పటివరకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులతోనే నడిచేది. న్యాక్‌ గుర్తింపు ద్వారా రూసా నిధులు కూడా రావడం సంతోషంగా ఉంది. ఈ నిధుల ద్వారా యూనివర్సిటీలో వసతులు పెరగడంతో పాటు, పీయూ పరిధిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అవకాశం ఉంటుంది.   – మధుసూదన్‌రెడ్డి, పాలమూరు యూనివర్సిటీ, కోఆర్డినేటర్‌   

మరిన్ని వార్తలు