స్వల్ప సంఖ్యలో విధుల్లో చేరిన కార్మికులు

4 Nov, 2019 05:04 IST|Sakshi
ఆదివారం ఉప్పల్‌ డిపో మేనేజర్‌కు సమ్మతి పత్రం ఇస్తున్న అకౌంటెంట్‌ కేశవకృష్ణ

ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధమంటూ 20 మంది లేఖలు..

రాష్ట్రవ్యాప్తంగా తిరిగిన 4,238 ఆర్టీసీ బస్సులు, 1,914 అద్దె బస్సులు

సాక్షి, నెట్‌వర్క్‌: సమ్మె వదిలి 5వ తేదీలోపు కార్మికులు విధుల్లో చేరాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపుతో ఆదివారం కొంతమంది కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎంతమంది కార్మికులు విధుల్లో చేరేందుకు సమ్మతి తెలిపారన్న విషయాన్ని ఆర్టీసీ అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు 20 మంది కార్మికులు సమ్మతి ప్రకటించినట్టు తెలిసింది. వీరిలో ఉప్పల్‌ డిపోలోని ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ (అకౌంటెంట్‌)గా పనిచేస్తున్న కె.కేశవకృష్ణ, వరంగల్‌ రీజియన్‌లో పనిచేస్తున్న ఐదుగురు సూపర్‌వైజర్లు రవీంద్ర, శ్రీహరి, రామ్మోహన్, సూర్యప్రకాశ్, వీరన్న ఉన్నారు.

సిద్దిపేట డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న బాలవిశ్వేశ్వర్‌రావు, మేడ్చల్‌ డిపో కండక్టర్‌ కేఎస్‌ రావు, కామారెడ్డి డిపో డ్రైవర్‌ హైమద్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో డ్రైవర్‌ ఎండీ ముబీన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిపో గ్యారేజీ మెకానిక్‌ శ్రీనివాస్‌ విధుల్లో చేరుతున్నట్లు లేఖలు అందజేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన కండక్టర్‌ మస్తాన్‌వలి విధుల్లో చేరేందుకు లేఖను అందజేశాడు. ఆర్టీసీ జేఏసీ నేతలు అతన్ని బుజ్జగించడంతో లేఖను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఆదివారం కూడా కార్మికులు ఉధృతంగా సమ్మె కొనసాగించారు. కార్మికులతో పాటు అఖిలపక్ష నేతలు కూడా పలుచోట్ల ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రోడ్డెక్కిన 4,238 ఆర్టీసీ బస్సులు.. 
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 4,238 ఆర్టీసీ బస్సులు, 1,914 అద్దె బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. 4,238 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,152 మంది తాత్కాలిక కండక్టర్లు వచ్చారని పేర్కొన్నారు. 5,588 బస్సుల్లో టిమ్‌ యంత్రాలు వాడామని, 346 బస్సుల్లో ట్రే ద్వారా టికెట్లు జారీ చేశామని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు