47.8 డిగ్రీలు

27 May, 2019 02:49 IST|Sakshi

రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు

మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో అత్యధికం

రాష్ట్రంలోని మరో 19 గ్రామాల్లో 47 డిగ్రీలకు ఎండలు

పడిపోతున్న గాలిలో తేమ శాతం... నిజామాబాద్‌లో 17 శాతానికి డౌన్‌

రోహిణీ కార్తెలో భానుడి భగభగ... మరో 3 రోజులు ఇదే పరిస్థితి

ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం, గాలిలో తేమ శాతం పెద్ద ఎత్తున పడిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఆదివారం 47 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, నిజామాబాద్‌లో 17, హైదరాబాద్‌లో 20 శాతానికి గాలిలో తేమ శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 20 గ్రామాల్లో వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లి మండలం నీల్వాయి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని ప్లానింగ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వెల్లడించింది.  

జగిత్యాల మండిపోతోంది...
రాష్ట్రంలో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 20 గ్రామాల్లో 9 గ్రామాలు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. «జిల్లాలోని దర్మపురి, వెలగటూరు, బీర్పూరు, జగిత్యాల రూరల్, సారంగపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మండలాల్లో సూర్యప్రతాపం ఎక్కువగా కనిపించింది. ఈ జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 47.5 నుంచి 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే అక్కడ ఎండలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఎండలు 47 డిగ్రీలు దాటిపోయాయి.  

తేమ తగ్గుతోంది...
మండే ఎండలకు తోడు గాలిలో తేమ శాతం కూడా పడిపోతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లాలో గాలిలో తేమ శాతం 17 శాతానికి పడిపోయింది. హైదరాబాద్‌లో 20, ఆదిలాబాద్‌లో 22, రామగుండంలో 27, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 28 శాతానికి పడిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎండకు బయటికి వచ్చిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కాసేపు ఎండలో ఉంటేనే తీవ్ర తాపానికి గురవుతుండటం గమనార్హం. అయితే, మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. మండే ఎండలు, వడగాడ్పులు, తేమ శాతం వాతావరణంలో తక్కువ కావడం కొనసాగుతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  
అమ్మో..యూవీ సెగ!
►ప్రమాదకరస్థాయిలో అతినీలలోహిత వికిరణ(యూవీ) ఇండెక్స్‌

►12 పాయింట్ల గరిష్టానికి చేరుకున్న వైనం ప్రచండ భానుడి ‘వికిరణ’ తీవ్రతకు గ్రేటర్‌వాసులు హడలిపోతున్నారు. మహానగరంలో ఇప్పుడు అతినీలలోహిత వికిరణం (అల్ట్రావయొలెట్‌ రేడియేషన్‌–యూవీ) తీవ్రత గరిష్టంగా ‘12’పాయింట్లకు (పూర్తిస్థాయి గరిష్టం) చేరుకుంది. సెగ.. భగలతో హైదరాబాద్‌ నగరవాసులు విలవిల్లాడుతున్నారు. సాధారణంగా మే నెలలో యూవీ సూచి 10 పాయింట్లకు మించరాదు. కానీ ఈసారి 12 మార్కుకు చేరుకుంది. ఈ ట్రెండ్‌ మరో నాలుగు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్‌ విస్తీర్ణంలో హరితం శాతం 8 శాతానికే పరిమితం కావడం, ఊపిరి సలపని రీతిలో నిర్మించిన బహుళ అంతస్తుల కాంక్రీట్, గాజు మేడల నుంచి ఉష్ణం వాతావరణంలో తేలికగా కలవకుండా భూఉపరితల వాతావరణానికే పరిమితం కావడంతో నగరంలో వికిరణ తీవ్రత పెరిగింది.  

యూవీ సెగ..భగలతో అవస్థలివీ...
►అతినీలలోహిత వికిరణ తీవ్రత(యూవీ ఇండెక్స్‌)పెరగడంతో ఓజోన్‌ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి.  

►ఈ కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరడంతోపాటు మనుషులపై పడుతుండటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులు ప్రబలుతాయి.

►అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మండటం, రెటీనా దెబ్బతినడం వంటి పరిణామాలు తలెత్తుతున్నాయి.  

►యూవీ సూచీ సర్వసాధారణంగా 7 పాయింట్లకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ 12 పాయింట్లు నమోదయితే చర్మం, కళ్లకు ప్రమాదం తథ్యం.  

►ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్‌స్క్రీన్‌ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్‌ ధరించాలని, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆదివారం నగరంలోని మాదాపూర్‌లో గరిష్టంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

►దేశంలోని గ్రేటర్‌ నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యంత తక్కువ గ్రీన్‌బెల్ట్‌ 8 శాతానికే పరిమితం అయింది.  

ఇలా చేస్తే మేలు...
నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్‌ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి, కాలుష్యం బాగా తగ్గుతుంది.
నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.

వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
ఖమ్మం: ఎండలకు తాళలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సూర్యప్రతాపం నానాటికీ పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. దమ్మపేట మండల కేంద్రంలోని అర్బన్‌కాలనీకి చెందిన గుంజి వెంకమ్మ (62), ప్రకాష్‌నగర్‌ కాలనీకి చెందిన బడుగు నాగశిరోమణి (60), టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన మేడ మల్లయ్య (70), కామేపల్లి మండల కేంద్రానికి చెందిన మంచాల చిట్టెమ్మ (50), ఖమ్మం రూరల్‌ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన ఎస్‌కే యాకూబ్‌మియా (70), వేంసూరు మండలం దుద్దెపూడి గ్రామానికి చెందిన పర్సా లక్ష్మీనారాయణ (32), జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన తోట భిక్షం (70), జవ్వాది లింగమ్మ(81) మృత్యువాత పడ్డారు.   

ఎండలు అప్‌..
గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఆదివారం 47 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

తేమ డౌన్‌..
నిజామాబాద్‌ జిల్లాలో గాలిలో తేమ శాతం 17శాతానికి పడిపోయింది. హైదరాబాద్‌లో 20, ఆదిలాబాద్‌లో 22, రామగుండంలో 27, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 28 శాతానికి పడిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎండకు బయటికి వచ్చిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు