పోలీస్‌లో మరో 2 వేల పోస్టులు!

24 Feb, 2016 03:19 IST|Sakshi

* ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో 2 బెటాలియన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
* కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఏర్పాటు యోచన
* కేంద్ర హోంశాఖకు నివేదించిన డీజీపీ అనురాగ్‌శర్మ
* సానుకూలంగా స్పందించిన కేంద్రం


 సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో అదనంగా రెండు వేల కానిస్టేబుల్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరో రెండు స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కరీంనగర్, ఖమ్మం జిల్లాలో వీటి ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు డీజీపీ ఈ నివేదిక అందజేశారు. అంతర్గత భద్రతలో భాగంగా రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరముందని కేంద్రం గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో పోలీస్ బెటాలియన్ల సంఖ్య 12కు చేరనుంది. ఇప్పటికే ఎనిమిది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్లు (టీఎస్‌ఎస్‌పీ), మరో రెండు ఇండియన్ రిజర్వు(ఐఆర్) బెటాలియన్లు ఉన్నాయి.

భద్రతపై ప్రధాన దృష్టి
 అంతర్గత భద్రతపై ఇటీవలి కాలంలో అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేంద్రం లేఖలు రాసింది. అల్లర్లు, ధర్నాలు, రాస్తారోకోలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అందుకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసుకోవడంతో, ఎప్పటికప్పుడు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అన్ని జిల్లాలో కూడా సివిల్ పోలీసులతో పాటు ప్రత్యేక బెటాలియన్లు ఉండేలా చూస్తోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక బెటాలియన్లు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు కాస్త ఎక్కువ కావడంతో ప్రభుత్వం భద్రతపై దృష్టిసారించింది. అందుకు అనుగుణంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న కరీంనగర్ జిల్లాతో పాటు, ఖమ్మంలో కూడా మరో బెటాలియన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

>
మరిన్ని వార్తలు