లోక్‌సభకు రెడీ 

1 Feb, 2019 10:36 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనసభ, పంచాయతీ పోరు ముగిసింది. ఇక లోక్‌సభ సమరానికి తెరలేచింది. అతిత్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 2014లో ఏప్రిల్‌ నెలాఖరున లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్‌ డేకు 90 రోజుల ముందు (గత ఎన్నికల రోజు) నిర్వర్తించాల్సిన క్రతువుకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను పరిశీలించనుంది. పార్లమెంట్‌ ఎన్నికలకు రెడీగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఇదివరకే సూచించింది. ముఖ్యంగా ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బంది, సామగ్రిని సమకూర్చుకోవాలని నిర్దేశించింది.

ఈవీఎంల ప్రక్షాళన 
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ప్రక్షాళనకు తొలి ప్రాధాన్యతనివ్వాలని ఈసీ దిశానిర్దేశం చేసింది. ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీఎంల సమర్థతను పరీక్షించాలని ఆదేశించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలనే పార్లమెంటు ఎన్నికలకు కూడా ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలలో నిక్షిప్తమైన శాసనసభ ఎన్నికల సమాచారాన్ని తొలగించనున్నారు. డేటాను చెరిపివేయడమేగాకుండా.. ఈవీఎంల మీద అంటించిన స్టిక్కర్లు ఇతరత్రా వివరాలను కూడా తొలగించే ప్రక్రియను నేటి నుంచి చేపట్టనున్నారు. అయితే, న్యాయపరమైన ఇబ్బందులున్న అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను మాత్రం అలాగే భద్రపరచనున్నారు.

ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం ఫలితంపై బీఎస్‌పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లలో నమోదైన ఓట్లలో తేడా ఉండడంపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం తెలిపారు. దీనిపై న్యాయస్థానంలో కేసు నడుస్తున్నందున ప్రస్తుతానికి ఈ సెగ్మెంట్‌కు వినియోగించిన 300 ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మినహా మిగతా నియోజకవర్గాల ఈవీఎంలను శుక్రవారం నుంచి మొదటి స్థాయి పరిశీలన (ఫస్ట్‌లెవల్‌ చెకింగ్‌) చేయనున్నారు. డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 3,073 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా 3,092 ఈవీఎంలను వినియోగించారు. వీటికి అదనంగా 566 రిజర్వ్‌గా ఉంచారు. వీటిలో ఇబ్రహీంపట్నం పోను మిగతా వాటిని పార్లమెంట్‌ ఎన్నికల్లో వాడనున్నారు. అలాగే గత ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్‌ యూనిట్లను యథాతథంగా వినియోగించనున్నారు.

4 వరకు ఓటరు జాబితా సవరణ

ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల నాలుగు ఆఖరు తేదీ. ఆ లోపు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 11వ తేదీలోపు అభ్యంతరాలు, పరిష్కారాలకు చివరి తేదీ. ఆ తర్వాత 17వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. ఈ నెల 22న రాజకీయ పార్టీల ప్రతినిధులకు కొత్త ఓటర్ల జాబితాను అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇదిలావుండగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలుండేవి. ఈ రెండింటికి గతంలో ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించేవారు. జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం జిల్లాలో చేవెళ్ల పార్లమెంట్‌ సెగ్మెంట్‌ మాత్రమే ఉంది. ఈ సెగ్మెంట్‌ పరిధిలో చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు వస్తుండగా, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌ భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వెళుతోంది. ఎల్‌బీనగర్‌ సెగ్మెంట్‌ మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. ఇక పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి జిల్లాలో చేరిన షాద్‌నగర్‌.. మహబూబ్‌నగర్‌ ఎంపీ సీటు పరిధిలో, అలాగే కల్వకుర్తి సెగ్మెంట్‌ పరిధిలోని కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలు నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలోకి రానున్నాయి.  

మరిన్ని వార్తలు