ఆర్టీసీలో తగ్గనున్న 2,080 బస్సులు

9 Jan, 2020 02:52 IST|Sakshi

హైదరాబాద్‌లో తగ్గించే వాటికి అదనంగా గ్రామాలపై దృష్టి 

నగరంలో ఇప్పటికే 800 బస్సుల తగ్గింపు..

గ్రామీణ ప్రాంతాల్లో 1,280 బస్సుల ఉపసంహరణకు నిర్ణయం

కొత్తగా అద్దె బస్సులు వస్తుండటమే కారణం

ఇప్పటికీ 800 ఊళ్లకు బస్సుల్లేవ్‌.. తాజా నిర్ణయంతో ఇక్కట్లే..  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో భారీగా బస్సుల సంఖ్య తగ్గుతోంది. హైదరాబాద్‌లో నష్టాలు ఎక్కువగా వస్తున్నాయన్న ఉద్దేశంతో దాదాపు 800 బస్సులను తగ్గించిన అధికారులు.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు తిరుగుతున్న 1,280 బస్సులను కూడా ఉపసంహరించబోతున్నారు. వెరసి 2,080 బస్సులు తగ్గిపోతున్నాయి. ఇది మొత్తంగా రాష్ట్రంపైనే తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 గ్రామాలకు బస్సులు వెళ్లటం లేదు. తాజా నిర్ణయంతో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.

అద్దె బస్సులు వస్తుండటంతో..
సొంత బస్సుల నిర్వహణను తీవ్ర భారంగా భావిస్తున్న ఆర్టీసీ క్రమంగా వాటిని తగ్గించుకోవాలని నిర్ణయించింది. వాటి స్థానంలో వీలైనన్ని అద్దె బస్సులను ప్రవేశపెట్టే దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2,100 అద్దె బస్సులు ఉండగా, వీటికి అదనంగా మరో పక్షం రోజుల్లో 1,334 బస్సులు రాబోతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెలాఖరుకు అవి రోడ్డెక్కబోతున్నాయి. కొత్తగా వస్తున్న అద్దె బస్సుల సంఖ్యతో సమంగా సొంత బస్సులను ఉపసంహరించుకోవాలని అధికారులు నిర్ణయించారు.

కొత్తగా నగరంలో 54 అద్దె బస్సులు చేరనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో 800 బస్సులను తగ్గించినందున కొత్తగా ఇక తగ్గించాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. ఇక నగరం వెలుపల 1,280 అద్దె బస్సులు కొత్తగా వస్తున్నందున, అంతే సంఖ్యలో సొంత బస్సులను ఉపసంహరించుకోబోతున్నారు. వాటిల్లో ఎక్కువ బస్సులు బాగా పాతవే. వాటిని తొలగించి ఆ స్థానంలో కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. అందుకే అద్దె బస్సులు తీసుకుంటోంది. 

మారుమూల గ్రామాలకు కష్టమే...
రాష్ట్రవ్యాప్తంగా 800 గ్రామాలకు బస్సు వసతి లేకుండా పోయింది. కొత్త బస్సులు కొని వాటిల్లో కొన్ని ఊళ్లకు నడపాలని గతంలో ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు కొత్త బస్సులు కొనే పరిస్థితి లేకపోవటంతో చేతులెత్తేయాల్సి వస్తోంది. అదనంగా అద్దె బస్సులు వస్తున్నా, అంతే సంఖ్యలో సొంత బస్సులను తగ్గిస్తున్నందున అదనంగా ఒక్క ఊరికి కూడా బస్సు తిప్పే పరిస్థితి ఉండదు. అద్దె బస్సుల నిర్వాహకులు మారుమూల ఊళ్లకు బస్సులు తిప్పేందుకు ఆసక్తి చూపరు. లాభాలు వచ్చే రూట్లలోనే వారు తిప్పుతారు. వెరసి దూరంగా ఉండే ఊళ్లపై దుష్ప్రభావం తప్పేలా కనిపించటం లేదు. 

హైదరాబాద్‌ను గ్యాస్‌చాంబర్‌గా మార్చొద్దు..
నగరంలో భారీ సంఖ్యలో బస్సులను తగ్గించటం వల్ల సొంత వాహనాల వినియోగం విపరీతంగా పెరిగి కాలుష్యం తీవ్రమవుతుందని, ఇది ఢిల్లీ తరహాలో నగరం గ్యాస్‌చాంబర్‌గా మారేందుకు దోహదం చేస్తుందని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ చిక్కులు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయని హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా వాహనాల సంఖ్య తగ్గించకూడదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

షెడ్యూల్స్‌ మార్చటం వల్ల సమస్యకు పరిష్కారం: అధికారులు
ఏయే ఊళ్లకు బస్సుల్లేవో ఎప్పటికప్పుడు గుర్తించి హేతుబద్ధీకరించటం ద్వారా షెడ్యూల్స్‌లో మార్పుచేర్పులు చేసి ఆయా ప్రాంతాలకు నడుపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఓఆర్‌ ఉండే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. ఇప్పుడు కూడా అద్దె బస్సులు రాగానే అదే తరహా కసరత్తు చేసి కొత్తగా కొన్ని ఊళ్లకు బస్సులు తిప్పుతామంటున్నారు. 

మరిన్ని వార్తలు