21,000 మంది విద్యుత్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ!

28 Jul, 2017 01:57 IST|Sakshi
21,000 మంది విద్యుత్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ!

నేడు విద్యుత్‌ బోర్డుల నిర్ణయం.. ఆ వెంటనే ఉత్తర్వుల జారీ!
సాక్షి, హైదరాబాద్‌

రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 21 వేల మందికి పైగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త. వారిని క్రమబద్ధీకరిస్తూ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు నేడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ ట్రాన్స్‌కో, విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌కో, దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు(టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) శుక్రవారం బోర్డు సమావేశం నిర్వహించి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఆమోదించనున్నాయి. ఇందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతుండటంతో విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగుల విలీనం (అబ్జార్‌ప్షన్‌) పేరిట ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. క్రమబద్ధీకరణను బోర్డులు ఆమోదిస్తే, ఆ మేరకు శనివారమే విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాలు, మార్గదర్శకాలను విద్యుత్‌ సంస్థల బోర్డులు మే 29న సమావేశమై ఆమోదించాయి. నాలుగు విద్యుత్‌ సంస్థల్లో 23,667 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 21 వేల మందికి పైగా అర్హులని సిఫార్సు చేస్తూ అవి ఇటీవలే నివేదిక ఇచ్చాయి. ఏపీ విద్యుత్‌ సంస్థల్లో ప నిచేస్తున్న తెలంగాణ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా తెలంగాణలో క్రమబద్ధీకరణ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపైనా శుక్రవారం బోర్డులు నిర్ణయం తీసుకోనున్నాయి.

1000 ఏఈ పోస్టుల భర్తీపై కూడా
ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లలో 1,000 మందికి పైగా అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఉమ్మడి ప్రకటన జారీ చేయడంపైనా విద్యుత్‌ సంస్థల బోర్డులు శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నాయి. తర్వాత వారం రోజుల్లో నియామక నోటిఫికేషన్‌ రానుంది.
విద్యుత్‌ సంస్థల్లో ఎన్నికలు వాయిదా వేయాలి
కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్దీకరణ నేపథ్యంలో విద్యుత్‌ సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. అధ్యక్షుడు కేవీ జాన్సన్‌ నేతృత్వంలోని బృందం గురువారం ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు వినతిపత్రం సమర్పించింది. కార్మికులందరిని క్రమబద్ధీకరించి వారికీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశమివ్వాలని కోరగా సీఎండీ అంగీకరించారని అనంతరం నేతలు తెలిపారు. క్రమబద్ధీకరణకు సహకరించిన ఎంపీ కవిత, ట్రాన్స్‌కో, డిస్కంల సీఎండీలకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు