జిల్లా ప్రణాళిక రూ 2149 కోట్లు

27 Jul, 2014 02:51 IST|Sakshi
జిల్లా ప్రణాళిక రూ 2149 కోట్లు

నిజామాబాద్ అర్బన్ :  మన జిల్లా-మన ప్రణాళికలో భాగం గా రూ. 2,149 కోట్లతో అభివృద్ధి పనులను ఖరారు చేశారు. శనివారం ప్రగతి భవన్‌లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు,  జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరైన సమీక్ష సమావే శం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగింది.  ఇప్పటి వరకు మన ప్రణాళిక- మన గ్రామం నుంచి రూ. 1,183 కోట్ల తో, మన మండలం -మన ప్రణాళిక నుంచి రూ. 966 కోట్ల అంచనాలతో అభివృద్ధి పనులు రూపొం దించినట్లు మంత్రి పోచారం పేర్కొన్నారు.

ఈ ప్రణాళిక ఐదు సంవత్సరాల వరకు అమలవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులను జిల్లా ప్రణాళిక లో చేర్చారు. పిట్లంలోని వేంపల్లి మత్తడి పూర్తి చేయడం ద్వారా 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, లెండి ప్రాజెక్టుకు రూ. 150 కోట్లు అదనంగా ఇస్తే 38 శాతం సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో ప్రాణహిత చేవెళ్లకు చెందిన చెరువులు, ట్యాంకుల నిర్మాణం సక్రమంగా లేదని, ప్రాణహిత చేవెళ్ల ప్రారంభమయితే నష్టం జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.

చెరువులు, ట్యాంకులను ప టిష్టం చేసందుకు మరో రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్లు ఇవ్వాలన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 16 లిఫ్టులు ఉండగా, ఇందులో ఎనిమిది  పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. గతంలో కాంట్రాక్టర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఇవి పోయాయని ఆరోపించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ మాట్లాడుతూ దోమకొండ మండలం బీబీపేట చెరువు, భిక్కనూరు, కాచాపూర్ చెరువులకు సంబంధించి అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రతిపాదించారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ గుజ్జల్‌తండా చెరువు సామర్థ్యం పెంచితే 15 వేల ఎకరాలకు సా గునీరు అందుతుందని తక్షణమే పెంచాలన్నా రు. ఆర్మూర్ నియోజకవర్గంలో గుత్ప ఎత్తిపోతల పథకం విస్తరించి అమ్రాద్‌తండా వరకు పంపుసిస్టమ్ తీసుకువస్తే 22 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు.
 
వ్యవసాయంపై
 జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మంత్రిని కోరారు.  పోచారం, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట ప్రాం తాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాల న్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అంకాపూర్‌లో విత్తనశుద్ధి కర్మాగారం చే యాలని, అంకాపూర్‌ను ప్రత్యేక వ్యవసాయజోన్‌గా ఏర్పాటు చేయడం ద్వారా విత్త న రీసెర్చ్ సెంటర్, వ్యవసాయ గిడ్డంగులు ఏర్పాటు చేయాలన్నారు. అంకాపూర్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, శాస్త్రజ్జులు సందర్శనకు వస్తున్నందున పీఆర్‌వోను ఏర్పాటు చేయాలని సూచించారు.  

మరికొన్ని ప్రణాళికలో
జిల్లాలో 72 గోదాములు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదించగా పొందుపరిచారు. వ్యవసాయదారులకు సబ్సిడీపై జనరేటర్లు, వ్యవసాయ యంత్రాలు, ప్రత్యేక ట్రాక్టర్లు అందించేందుకు  తీర్మానం చేశారు. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్‌ల ఏర్పాటు చేయాలని పొందుపరిచారు.

పశుసంవర్ధకశాఖ
జిల్లాలోని వెటర్నరీ కళాశాల ఏర్పాటు, 45 పశువైద్య ఆసుపత్రులు, 5 చెక్‌పోస్టులు , పాల వస్తువులు అందించేందుకు కృషి చేయడం, ఎర్రజొన్నచొప్ప, మొక్కజొన్నచొప్ప రిజర్వు చేసుకొని పశువులకు ఆహారంగా ఇచ్చేందుకే కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు, పశువ్యాధి నిర్ధారణ భవనం, పశుసంవర్ధకశాఖలో అన్నిపోస్టులను భర్తీ చేయాలని తీర్మానించారు. జిల్లాలోని పనిచేయని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను తిరిగి ప్రారంభించడం, వాటి ఉత్పత్తిని పెంచడం  వంటి కార్యక్రమాలను రూపొందించారు.

విద్యాశాఖ
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి 3వ తరగతి వరకు ఇంగ్లీష్ విద్యను అందించాలని ఎమ్మెల్యే  ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రతిపాదించగా  మిగితా ప్రజాప్రతినిధులు ఆమోదించారు. పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు రేషనైజేషన్‌ను చేపట్టడం,  ఉపాధ్యాయులు  ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడడం, డుమ్మ కొట్టే టీచర్లపై చర్యలు తీసుకోవడం,  తరగతి గదులు అవసరమైన చోట  చేపట్టాలని నిర్ణయించారు. అలాగే  మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల, నియోజక వర్గానికి డిగ్రీ కళాశాల , కామారెడ్డిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ప్రణాళికలో పొందుపరిచారు.  

వైద్య ఆరోగ్యశాఖ
జిల్లాలో అదనంగా 25 ప్రాథమిక ఆరోగ్యకేం ద్రాల ఏర్పాటు, ప్రతి ఆసుపత్రిలో వైద్యు డు, కుక్కకాటుకు, పాముకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచా లి. ప్రతి నియోజక వర్గంలో ఏరియా ఆసుపత్రి, పెద్ద మండలంలో పది పడకల మరో ఆసుపత్రి ఏర్పాటు చేయాలి.  ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాలను పెంపొందించాలి. వీటి సేవలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లేందుకు పాటుపడాలి. జిల్లా కేంద్రంలో జిల్లా  ఆరోగ్యశాఖ కార్యాలయానికి ఐదు ఎకరాల స్థలం, రూ. 2 కోట్ల రూపాయల మంజూరుకు ప్రతిపాదించారు.

పంచాయతీరాజ్
ప్రతి గ్రామానికి రోడ్లు, మండలం నుంచి జిల్లాకు రోడ్ల విస్తరణ చేపట్టాలి. ఎల్లారెడ్డిలో  ఆరు గ్రామాలకు, ఆర్మూర్ నియోజక వర్గంలో 8 గ్రామాలు, బాల్కొండ నియోజకవర్గంలో 4 గ్రామాలు, కామారెడ్డి పరిధి లో 4 గ్రామాల నుంచి మండలాలకు రోడ్ల విస్తరణ చేపట్టేందుకు నిర్ణయించారు.  బిచ్కుంద, మద్నూరు, జుక్కల్ ప్రాంతాలకు రోడ్ల విస్తరణ, నందిపేట, నిజామాబాద్, ఆర్మూర్,  నందిపేట నుంచి నూత్‌పల్లి వరకు రోడ్ల బాగుకు ఈ ప్రణాళికలో చేర్చారు. ఈనెల 31వరకు ఎక్కడెక్కడైతే అభివృద్ధి పనులకు అసౌకర్యం ఉందో కలెక్టర్‌కు సమర్పిస్తే ప్రణాళికలో పొందుపరుస్తామని మంత్రి పోచారం సమావేశంలో తెలియజేశారు.

>
మరిన్ని వార్తలు