'రేషన్' ఏరివేత

29 Jun, 2014 01:40 IST|Sakshi
'రేషన్' ఏరివేత

22 లక్షల బోగస్ కార్డుల రద్దు.. సీఎం సమీక్ష సమావేశంలో నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్:
 తెలంగాణ రాష్ట్రంలో బోగస్ కార్డులను ఏరివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 లక్షల బోగస్ కార్డులు ఉన్నట్టు గుర్తిం చామని.. ఈ కార్డులను త్వరలోనే ఏరివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్డుల ఏరివేత సమయంలోనే తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తామని తెలిపింది. బోగస్ కార్డుల్లో 7 లక్షలు తెలుపు రంగు, 15 లక్షల గులాబీ రంగు కార్డులు ఉన్నట్టు అంచనా వేశారు. బోగస్ కార్డుల ఏరివేత, కొత్త కార్డుల జారీ వంటి అంశాల పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి, మేనేజింగ్ డెరైక్టర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
 ఆధార్ వివరాలతో క్రోడీకరించి...
 
 తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కంటే
 
 రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం పేర్కొన్న విషయం తెలిసిందే. తద్వారా రేషన్ కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే తన సంకల్పాన్ని కేసీఆర్ అప్పుడే పరోక్షంగా వెల్లడించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. బోగస్ కార్డులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఇంతకుముందు జారీ చేసిన కార్డులతో పాటు, నంబర్ మాత్రమే ఇచ్చి కార్డులను ఇవ్వకుండా రేషన్ సరుకులను (కూపన్లపై) ఇస్తున్న వారి విరాలను కూడా తీసుకున్నారు. రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంది. రేషన్ కార్డుల జారీ కోసం సేకరించిన ఐరిస్, వేలిముద్రలతో పాటు ఆధార్ కార్డుల జారీకి తీసుకున్న కుటుంబాల వివరాలను కూడా ప్రత్యేక సర్వర్ ద్వారా క్రోడీకరించారు. దాంతో బోగస్ కార్డులు ఎన్ని అనే విషయం తెలిసింది. ఆలాగే ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఎన్ని ఉన్నాయనే వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుల కోసం 83.59 లక్షల కుటుంబాలు అర్హమైనవిగా ఉంటే.. ప్రస్తుతం 91 లక్షల తెలుపు రంగు కార్డులు ఉన్నాయి. అంటే 7 లక్షలకు పైగా తెలుపు రంగు కార్డులు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే 15 లక్షల గులాబి రంగు కార్డులు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేశారు. ఇలా మొత్తం 22 లక్షల రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని రద్దు చేయాలని శనివారం నాటి ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ బోగస్ కార్డులను తొలగించడంతో పాటు అన్ని రకాల కార్డులను కొత్తగా ముద్రించనున్నారు.
 
 బోగస్ కార్డులను సరెండర్ చేయాలి...
 
 రేషన్ షాపుల వద్ద ఉన్న బోగస్ కార్డులను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలా బోగస్ కార్డులను తమ వద్దే ఉంచుకుని రేషన్ సరకులను పక్కదారి పట్టించే డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు కూడా అప్రమత్తమై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాల వైఖరి కారణంగా ఇలా కుటుంబాల సంఖ్య కంటే కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని, దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగడంతో పాటు ప్రభుత్వంపై భారం పడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
 
 రేషన్ కార్డు.. రేషన్ సరుకులకే పరిమితం
 
 రేషన్ కార్డు కేవలం రేషన్ సరకుల పంపిణీకే ఉపయోగపడే విధంగా పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ కార్డులతో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పలు పథకాలు లింకు ఉంది. అయితే ఒక కార్డును ఒకే పధకానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తసుకుంది. తద్వారా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగటంతో పాటు ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఉన్నతాధికారులకు సూచించారు.
 

మరిన్ని వార్తలు