కర్బన ఉద్గారాలు! డొక్కు విమానాలు..

29 Jan, 2020 02:28 IST|Sakshi
గత కొన్నేళ్లుగా నగరం నుంచి ఒక రోజుకు రాకపోకలు సాగిస్తున్న దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఏటా ప్రయాణికుల సంఖ్య ఇలా ఉంది...

పరిమితికి మించి గాలిలో కర్బన ఉద్గారాల విడుదల

ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ క్లీన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నివేదికలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: మహానగరంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ ఏటేటా పెరుగుతుండటంతో వాటి నుంచి వెలువడే కర్భన ఉద్గారాలు, ఏరోసాల్స్‌ కాలుష్యం (విమానాల కాలుష్యం) కూడా పెరుగుతూనే ఉంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గతేడాది 23% ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగింది. కానీ, గ్రేటర్‌ నుంచి రాకపోకలు సాగించే పలు దేశీయ, అంతర్జాతీయ విమానాల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండటం, నాణ్యత లేని ఇంధనాల వినియో గం వెరసి కర్బన ఉద్గారాల కాలుష్యం పెరుగుతోంది.

ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ క్లీన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. దేశంలో ముంబై నుంచి రాకపోకలు సాగిస్తున్న విమానాల నుంచి 24%, హైదరాబాద్‌ నుంచి బయల్దేరుతున్న విమానాల నుంచి 13%, కోల్‌కతా నుంచి రాకపోకలు సాగిస్తున్న విమానాల నుంచి 6% కర్భన ఉద్గారాలు వెలువడుతున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. నిబంధనల ప్రకారం ఈ పరిమి తి 5% మించకూడదని స్పష్టం చేసింది.

కాలుష్యం వెలువడుతోంది ఇలా... 
విమానాల్లో ఇంధనంగా వినియోగించే గ్యాసోలిన్‌ నాణ్యత లేకపోవడం, విమానాల నిర్వహణ అంతంతమాత్రం గానే ఉండటం, పలు రసాయన పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, సరిగా మండని పెట్రోలు, డీజిల్‌ వంటి ఇంధనాలు, జీవ ఇంధనాలు, బయోమాస్‌ను  తగులబెట్టడం వంటి పరిణామాలతో ఏరోసాల్స్‌ కాలుష్యం ఉత్పన్నమౌతుంది. ఈ ఏరోసాల్స్‌లో బ్లాక్‌ కార్బన్‌తోపాటు ఇతర హానికారక వాయువులు, ఆవిరులు, ధూళికణాలు అధిక మోతాదులో ఉంటాయి. వీటి కారణంగా రుతుపవనాలు గతితప్పడం, అకాల వర్షాలు, అధిక వేడిమి వంటి విపరిణామాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇలా లెక్కించాలి... 
కర్భన ఉద్గారాలు, ఏరోసాల్స్‌ కాలుష్యాన్ని లెక్కించేందుకు 16 ఏథలోమీటర్స్, 12 స్కై రేడియోమీటర్స్, 12 నెఫిలో మీటర్లను నగరం నలుమూలల ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటి ద్వారా ఏరోసాల్స్‌ ఉధృతి, అందులో అంతర్భాగంగా ఉన్న బ్లాక్‌కార్బన్‌ మోతాదును లెక్కించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఢిల్లీ ఐఐటీ ఆధ్వర్యంలో చేసిన ఓ అధ్యయనంలో గత దశాబ్దకాలంగా ఏరోసాల్స్‌ మోతాదు అధికమొత్తంలో పెరిగినట్లు తేలింది. దీంతో పర్యావరణం, వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోవడంతోపాటు మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని తేలింది.  పీసీబీ లెక్కిస్తున్న సూచీలో ఏరోసాల్స్‌ కాలుష్యాన్ని లెక్కించేందుకు అవకాశం లేదని పీసీబీ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తుండటం గమనార్హం.  

రోజువారీగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల సంఖ్య, కాలుష్యం మోతాదు ఇలా ఉంది.. 
మెట్రోనగరం    విమాన సర్వీసులు   కర్బన ఉద్గారాల శాతం 
ముంబై              778                          24
హైదరాబాద్        400                          13
కోల్‌కతా            567                           06
ఢిల్లీ                  600                           5.9
చెన్నై                487                           5.8
బెంగళూరు        508                           5.2

మరిన్ని వార్తలు