రాష్ట్రంలో 23 పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లు

30 Aug, 2018 01:25 IST|Sakshi

     సెప్టెంబర్‌ 1న లాంఛనంగా ప్రారంభం

     తెలంగాణ సీపీఎంజీ బ్రిగేడియర్‌ చంద్రశేఖర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు పోస్టల్‌ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 23 ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయమై బుధవారం హైదరాబాద్‌లోని డాక్‌సదన్‌ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌(సీపీఎంజీ) బ్రిగేడియర్‌ బి.చంద్రశేఖర్‌ మాట్లాడారు. పేమెంట్‌ బ్యాంక్‌ శాఖలను సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ఒకే రోజు దేశ వ్యాప్తంగా 650 పోస్టల్‌ బ్యాంకులు, 3,250 అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ సర్కిల్‌లో తొలివిడతగా 115 అనుబంధ కేంద్రాలు ప్రారంభించి.. డిసెంబర్‌ 31 నాటికి అన్ని పోస్టల్‌ ఆఫీసులకు విస్తరించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. కరెంట్‌ ఖాతాల లావాదేవీలపై ఎటువంటి పరిమితి లేదని, సేవింగ్‌ ఖాతాలపై మాత్రం కొంత పరిమితి ఉందని స్పష్టం చేశారు. 

డోర్‌ స్టెప్‌ లావాదేవీలు..: ఇంటి వద్ద నుంచే పోస్టు మ్యాన్‌ వద్ద ఉన్న మైక్రో ఏటీఎం ద్వారా కొత్త ఖాతాలు ప్రారంభించవచ్చని చంద్రశేఖర్‌ తెలిపారు. అంతేకాకుండా డిజిటల్‌ పేమెంట్స్, నగదు రహిత లావాదేవీలు, కరెంట్‌ తదితర లావాదేవీలు జరుపుకోవచ్చని పేర్కొన్నారు. కేవలం 3 నిమిషాల్లో లావాదేవీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ సెల్‌ఫోన్‌కు వస్తుందన్నారు. సేవింగ్‌ ఖాతాలను రూ.100తో, కరెంట్‌ ఖాతాలను రూ.1000లతో ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని సైతం అందిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు