ఆ ఇంజనీరింగ్‌ కాలేజీలకు గుర్తింపు వచ్చేనా?

16 Dec, 2019 02:38 IST|Sakshi

భవన నిర్మాణ అనుమతులు లేకుండానే కొనసాగుతున్న 238 కాలేజీలు

అనుమతి పత్రాలు ఉంటేనే గుర్తింపు ఇస్తామని రెండేళ్ల కిందటే పేర్కొన్న ఏఐసీటీఈ

గత నెలతో ముగిసిన గడువు.. దీంతో మళ్లీ నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 238 ఇంజనీరింగ్‌ కాలేజీలకు కష్టకాలం వచ్చింది. 2020–21 విద్యా సంవత్సరంలో వాటికి గుర్తింపు వస్తుందో.. లేదోనన్న.. ఆందోళన మొదలైంది. రాష్ట్రం లోని ఆయా కాలేజీలకు భవన నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా భవనాలను నిర్మించి కొనసాగిస్తున్నాయి. ఈ అంశం పై రెండేళ్ల కిందట అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి ఫిర్యాదులు అందాయి.

దీంతో ఆ యాజమాన్యాలకు ఏఐసీటీఈ నోటీసులు జారీ చేసింది. అనుమతి పత్రాలిస్తేనే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టేందుకు గుర్తింపు ఇస్తామని తెలిపింది. చివరకు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏఐసీటీఈ ఆ కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రెండే ళ్లలో అనుమతులు తెచ్చుకోవాలని చెప్పింది. అయినా యాజమాన్యాలు ఇప్పటికీ అనుమతులు తీసుకోలేదు.

ముగిసిన గడువు.. మళ్లీ నోటీసులు.. 
గతంలో యాజమాన్యాలు తమకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఏఐసీటీఈ నిరాకరించడం, దానివల్ల రాష్ట్రంలో 238 కాలేజీల్లో ప్రవేశాలు ఆగిపోతే మంచిది కాదన్న ఉద్దేశంతో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఏఐసీటీఈకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయడంతో రెండేళ్లపాటు మినహాయింపు ఇచ్చింది. ఆ కాలేజీలకు ఇచ్చిన గడువు గత నెలతోనే ముగిసిపోవడంతో ఏఐసీటీఈ మళ్లీ నోటీసులు జారీ చేసింది.

హెచ్‌ఎండీఏలోనే అధికం.. 
అనుమతుల్లేకుండా కొనసాగుతున్న కాలేజీల్లో ఎక్కువ శాతం హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. వాటిల్లోనూ 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో 42 కాలేజీలు ఉన్నాయి. 238 కాలేజీల్లో కొన్ని కాలేజీలు గ్రామ పంచాయతీ అనుమతితో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాయి. ఆ 238 కాలేజీల స్థలాలు, భవనాలు, ఇతర అనుమతుల పత్రాలను తనిఖీ చేసి అక్టోబర్‌లోపు నివేదిక అందించాలని ఏఐసీటీఈ గత ఏప్రిల్‌లోనే రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించింది.

అది ఆ బాధ్యతను రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అప్పగించింది. ఇంతవరకు కనీసం వాటిని తనిఖీ చేయలేదు. చివరకు ఆ బాధ్యతను జేఎన్టీయూకు ఉన్నత విద్యా మండలి అప్పగించింది. దీంతో సంబంధిత అనుమతి పత్రాలను అందజేయాలని యాజమాన్యాలకు జేఎన్టీయూ లేఖలు రాసినా స్పందించలేదు. ఈ క్రమంలో ఏఐసీటీఈ మళ్లీ నోటీసులు జారీ చేయడంతో యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది.

మరిన్ని వార్తలు