నేటి నుంచి బాలోత్సవ్

7 Nov, 2014 02:21 IST|Sakshi

కొత్తగూడెం: జాతీయస్థాయి 23వ అంతర పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు (బాలోత్సవ్-2014)కు అంతా సిద్ధమైంది. విద్యార్థులు తమ ప్రతిభ చాటుకునేందుకు సిద్ధమయ్యారు. కొత్తగూడెం క్లబ్ వేదికగా శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం నుంచే వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒక్కొక్కరిగా వస్తుండటంతో పట్టణంలో బాలల సందడి నెలకొంది. చిన్నారులకు ఆతిథ్యమిచ్చేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు.

మూడురోజుల పండుగను ముచ్చటగా జరుపుకుని ఆ మధురస్మృతులను తమ మదిలో దాచిపెట్టుకునేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఎంతో ఆసక్తికరంగా జరుగుతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. జాతీయస్థాయి పోటీలు కావడంతో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు విద్యార్థులు కూడా తమ ఎంట్రీలను నమోదు చేసుకున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఆరు రాష్ట్రాల నుంచి చిన్నారులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ప్రతిభాపాటవాలను ప్రదర్శించనున్నారు. వారిలోని సృజనాత్మకతను బయటపెట్టడంతో పాటు అది నలుగురికి ఉపయోగపడేలా ఈవెంట్లను సిద్ధం చేసుకున్నారు.

 చైతన్యాన్ని నింపేందుకు...
 మట్టి బొమ్మలు అనగానే గుర్తుకొచ్చేది వినాయక చవితి. పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను మట్టితో తయారుచేసి పర్యావరణాన్ని కాపాడాలంటూ చేసే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈసారి ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని బాలోత్సవ్‌లో మట్టి బొమ్మలు తయారు చేసే పోటీని నిర్వహిస్తున్నారు. ఎంతోమంది చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ బొమ్మలను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ప్లాస్టిక్, పీఓపీ ఇతర రకాల బొమ్మలు పెరిగిపోయిన నేపథ్యంలో మట్టి బొమ్మలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వ్యర్థంతో అర్థం’ అనే అంశం కూడా అందరిలో చైతన్యం నింపేదే. మనం ఎందుకూ పనికిరావనుకునే పదార్థాలు, వస్తువులతో విద్యార్థులు అద్భుతమైన ఆకృతులను తయారు చేసి ప్రదర్శిస్తారు. వీటిని చూసేందుకు వచ్చేవారు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురికాక తప్పదు.
 
జానపదం వైపే మొగ్గు
 ఎక్కువ మంది విద్యార్థులు జానపద కళపై ఆసక్తి చూపుతున్నారు. జానపద నృత్యాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజులపాటు జరిగే జానపద నృత్య పోటీల్లో సుమారు 200కు పైగా ప్రదర్శనలు ఇస్తారు. పోటీల్లో అత్యంత ఆదరణ లభించేది కూడా ఈ జానపద నృత్యాలకే. ప్రేక్షకుల కేరింతలు జానపద నృత్య ప్రాంగణం హోరెత్తనుంది.
 
అందర్నీ ఆకట్టుకునే నాటికలు
 బాలోత్సవ్‌లో అందర్నీ ఆకట్టుకునే వాటిలో నాటికలు కూడా ఉన్నాయి. నాటికల్లో భాగంగా బాల్య వివాహాలు, బాలల చదువు, మూఢ నమ్మకాలు, అమ్మాయిల చదువు వంటి అంశాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. హాస్య నాటికలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు చిన్నారి కళాకారులు సిద్ధమయ్యారు. ఇక్కడ ప్రదర్శించే ప్రతి నాటిక ఓ సందేశంతో కూడుకొని ఉంటుంది.

మరిన్ని వార్తలు