పల్లెలకూ 24 గంటల విద్యుత్

10 Apr, 2015 02:26 IST|Sakshi
  • ఐదేళ్లలో 6,800 మెగావాట్ల అదనపు విద్యుత్: జగదీశ్ రెడ్డి
  • సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో 6,800 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా జెన్‌కో పని చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం 24 గంటల విద్యుత్‌సరఫరా చేయాలని కృతనిశ్చయంతో వున్నామన్నారు. నిరంతర విద్యుత్ కోసం ప్రవేశపెట్టిన ‘అందరికీవిద్యుత్’ పథకం కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసే విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

    గురువారం గువాహటి (అస్సాం)లో నిర్వహించిన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 9 గంటలకు పెంచే యోచనలో వున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఏటా 10.67 మిలియన్ టన్నుల బొగ్గు కేటాయింపులు ఉన్నప్పటికీ 2019-20 నాటికి బొగ్గు అవసరాలు 46.5 మిలియన్ టన్నులకు పెరుగుతాయని, ఈ మేరకు అదనపు బొగ్గును కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2,965 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రైవేటు రంగంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మరిన్ని వార్తలు