మూడేళ్లలో 24గంటలూ విద్యుత్

5 Nov, 2014 03:11 IST|Sakshi

 నార్నూర్ : వచ్చే మూడేళ్లలో 24గంటలూ విద్యుత్ సరఫరా చేసే విధంగా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి మండలంలోని అర్జుని గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో రూ.75లక్షలతో నిర్మించిన సిబ్బంది నివాస సముదాయం, లోకారి-బి గ్రామంలో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో రూ.1.60లక్షలతో నిర్మించిన పాఠశాల భవనం, పర్సువాడలో సీసీడీపీ పథకం కింద రూ.10లక్షలతో నిర్మించిన భవనం, గాదిగూడలో రూ.12లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ పౌండేషన్ భవనం ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించి తీరుతామని అన్నారు. ఈ నెల 8 నుంచి రూ.200 పింఛన్ తీసుకుంటున్న వారికి రూ.వెయ్యి, రూ.500 పింఛన్ తీసుకుంటున్న వారికి రూ.1,500 పెంపును ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల పెళ్లి కోసం కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం రూ.51వేలు ఇస్తుందని తెలిపారు.

పదో తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఝరిలో పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిప్రీ గ్రామ పంచాయతీ పరిధి అంద్‌గూడ, కొలాంగూడ, కుండి, చిన్నకుండి గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించడానికి బోర్‌వెల్స్ మంజూరు చేస్తామని హామీనిచ్చారు. ఖడ్కి నుంచి లోకారి-బి గ్రామం వరకు బీటీ రోడ్దు మంజూరు చేస్తామన్నారు.

ఎంపీపీ రాథోడ్ గోవింద్‌నాయక్, జెడ్పీటీసీ సభ్యురాలు రూపావంతిజ్నానోబా పుస్కర్, ఎంపీటీసీ సభ్యుడు దేవురావ్, సర్పంచ్‌లు జంగుబాయి, కన్ను, మేస్రం లచ్చు, జాకు కొడప, ఇంద్రభాను, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మేస్రం హన్మంతరావ్, డీఈ తానాజీ, జేఈ ఇందల్, నాయకులు లోఖండే చంద్రశేఖర్, ఉర్వేత రూప్‌దేవ్, మోతే రాజన్న, సయ్యద్‌ఖాశీం, దాదేఆలీ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు