24x7 మీ సేవలో..

25 Aug, 2019 01:58 IST|Sakshi

రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల కోసం స్పెషల్‌ హెల్ప్‌డెస్క్‌

వీల్‌చైర్, వైద్య సహాయంతో పాటు అన్ని సదుపాయాలు  

సాక్షి, హైదరాబాద్‌ : రైల్వే స్టేషన్‌లో మీరు వేచి ఉన్న విశ్రాంతి గదిలో తాగునీరు లేదా.. ఏసీలు పని చేయడం లేదా... టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయా.. వీల్‌చైర్స్‌ కావాలా... ఇకపై ఇలాంటి సమస్యలను  పరిష్కరించేందుకు ప్రయాణికుల సహాయ కేంద్రం సిద్ధంగా ఉంది. 24/7 ఈ కేంద్రం పని చేసేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా హెల్ప్‌ డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చారు. వైద్యం, అంబులెన్స్‌లు వంటి  అత్యవసర సేవలతో పాటు అన్ని రకాల ప్రయాణ సదుపాయాల కోసం నేరుగా ఈ సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చు. 

హెల్ప్‌ డెస్క్‌ సేవలు ఇలా...
రైల్వేస్టేషన్‌ల అభివృద్ధి, సదుపాయాల విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు రైల్వేస్టేషన్‌లు బెంగళూర్, పుణే, సికింద్రాబాద్, ఢిల్లీలోని ఆనంద్‌బాగ్, చండీఘర్‌లను ఎంపిక చేసి ఇండియన్‌ రైల్వేస్టేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ)కి అప్పగించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఒకటో నంబర్, పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ల వద్ద సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు నేరుగా కానీ, ఫోన్‌ నంబర్ల ద్వారా కానీ సేవలను పొందవచ్చు. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణులు, నడవలేని స్థితిలో ఉన్న రోగుల కోసం వీల్‌చైర్‌లను ఏర్పాటు చేస్తారు. కొత్తగా వచ్చే ప్రయాణికులు ఏ ప్లాట్‌ఫామ్‌కు ఎలా వెళ్లాలి, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఎక్కడ ఉన్నాయో చెబుతారు. ఏసీ వెయిటింగ్‌ హాళ్లు, ప్రీపెయిడ్‌ రెస్ట్‌రూమ్‌ల వివరాలను తెలియజేస్తారు. స్టేషన్‌ పరిశుభ్రత, మంచినీటి సదుపాయం, టాయిలెట్ల నిర్వహణ, విద్యుత్‌ సదుపాయం వంటి వివిధ రకాల సేవల్లో లోపాలకు తావు లేకుండా చూస్తారు.  

  • దేశవ్యాప్తంగా రైళ్ల నిర్వహణ, టికెట్‌ బుకింగ్, రిజర్వేషన్ల వంటి అంశాలకు మాత్రమే రైల్వేలు పరిమితమవుతాయి. స్టేషన్ల నిర్వహణ, రైల్వేస్థలాల్లో వాణిజ్య కార్యకలాపాల విస్తరణ ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం వంటివి ఐఆర్‌ఎస్‌డీసీ పరిధిలోకొస్తాయి.
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌  కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించారు.  తొలిదశలో ప్రయాణికుల సదుపాయాల నిర్వహణ, రెండో దశలో స్టేషన్‌ పునరాభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నారు. 

సికింద్రాబాద్‌లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య : 1.95 లక్షలు
రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య (సుమారు) : 150
మొత్తం ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య : 10 

వీల్‌చైర్, హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ నంబర్‌ : 040–27788889 
వాటర్, టాయిలెట్లు, విద్యుత్, రెస్ట్‌రూమ్స్‌ వంటి వాటి కోసం : 040–27786607 
ఐఆర్‌ఎస్‌డీసీ సిబ్బంది సహాయం కోసం : 8008400051, 9849759977 

మరిన్ని వార్తలు