249 మంది వైద్య విద్యార్థులపై వేటు 

11 Jan, 2020 01:48 IST|Sakshi
కాకతీయ మెడికల్‌ కళాశాల (కేఎంసీ)

హాజరు లేక పరీక్షకు అనర్హత

ఎంజీఎం: వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాల (కేఎంసీ) ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ద్వితీయ, తృతీయ ఏడాది చదువుతున్న 249 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. పరీక్షలు రాసేందుకు శుక్రవారం వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో కేఎంసీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తృతీయ సంవత్సరానికి చెందిన 176 మంది ఎస్పీఎం సబ్జెక్టులో, ద్వితీయ సంవత్సరానికి చెందిన 15 మంది ఫార్మకాలజీలో, 18 మంది పథాలజీ, 40 మంది మైక్రోబయాలజీ తరగతులకు సక్రమంగా హాజరుకాలేదు. వారి హాజరు 75 శాతం కంటే తక్కువగా ఉండటంతో పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవగా.. పోలీసులు వారికి నచ్చజెప్పి సామరస్య పూర్వకంగా పరిశీలించుకోవాలన్నారు.

విద్యార్థుల విన్నపాన్ని పరిశీలిస్తాం 
ఆయా విభాగాల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండటం వల్లే పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించాం. ఈనెల 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. హాజరు శాతంపై ఆయా విభాగాధిపతులతో చర్చించాం. విద్యార్థుల విన్నపాన్ని పరిశీలిస్తాం. విద్యార్థులు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్‌ సంధ్య, ప్రిన్సిపాల్, కేఎంసీ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు