వలస కూలీల లారీ బోల్తా 

17 May, 2020 04:21 IST|Sakshi
క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

25 మందికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

నిర్మల్‌ వద్ద ఎన్‌హెచ్‌ 44పై ఘటన

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రం సమీపంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వలస కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీలో మొత్తం 73 మంది ఉండగా, వీరిలో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 48 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన వారిని నిర్మల్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూపీ, బిహార్‌కు చెందిన ఈ కూలీలు హైదరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు, మేడ్చల్‌ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపు ఇవ్వడంతో వీరంతా లారీలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు బయలుదేరారు. లారీని డ్రైవర్‌ కాకుండా క్లీనర్‌ నిద్రమత్తులో అతివేగంగా నడపడం వల్లే అదుపుతప్పి, రోడ్డుపక్కకు దూసుకుపోయి బోల్తాపడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. కూలీలకు రూ.10 వేల సాయం అందించారు.

మరిన్ని వార్తలు