జాబ్‌మేళా.. జనమేళా

31 Jul, 2017 06:47 IST|Sakshi
జాబ్‌మేళా.. జనమేళా

రైల్వే జాబ్‌మేళాకు వివిధ ప్రాంతాల నుంచి 25 వేల మంది హాజరు
ప్రారంభించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ


హైదరాబాద్‌: రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం దక్షిణమధ్య రైల్వే, కేంద్ర కార్మిక శాఖ తొలిసారిగా నిర్వహించిన జాబ్‌ మేళా ‘మన కోసం’ కు అనూహ్య స్పందన వచ్చింది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ మేళాను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. వివిధ కంపెనీల్లోని 10 వేల ఉద్యో గాల కోసం నిర్వహించిన ఈ మేళాకు 21 వేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోగా... 25 వేల మంది హాజరయ్యారు. దీంతో ప్రాంగణం కిటకిట లాడింది. పరిసర ప్రాంతాల్లో ఐదు గంటలకు పైగా ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దక్షిణమధ్య రైల్వే 6వ డివిజన్‌ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయ వాడ, గుంతకల్లు, నాందేడ్‌ సర్కిళ్ల రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాలో వివిధ కంపెనీలు ఐదువేల మందికి నియామక ఉత్తర్వులిచ్చాయి. మిగిలిన ఐదువేల మందికి వారం తరువాత ఉత్తర్వులిచ్చి, శిక్షణ కార్య క్రమాలు చేపడతామన్నాయి. అయితే ఇందులో పాల్గొన్న 109 కంపెనీల్లో చాలావరకు టెలీకాలర్, సేల్స్, డెలివరీ బాయ్స్, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వంటి ఉద్యోగాలే ప్రకటించడంతో ఎంతో ఆశతో వచ్చిన నిరుద్యోగులు నిరుత్సాహపడ్డారు.

100 కెరీర్‌ గైడెన్స్‌ కేంద్రాలు: దత్తాత్రేయ
దేశoలో 60 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ వివిధ పథ కాలు తెస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవా లని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. బ్రెజిల్‌ తదితర దేశాలతో ఉద్యోగ నియామకాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. దేశ వ్యాప్తంగా 100 జాతీయ కెరీర్‌ సేవల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ కేంద్రం ప్రారంభించామని, త్వరలో వరంగల్, కరీంన గర్‌లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, చిత్తూరు, వైజాగ్‌లలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇందులో ఉద్యోగాలు రాని వారి కోసం ఆగస్టు మొదటి వారంలో మరో జాబ్‌మేళా నిర్వహిస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు