కొహెడ మార్కెట్‌లో గాలివాన బీభత్సం..

4 May, 2020 19:07 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  కొహెడలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో కొహెడ పండ్ల మార్కెట్‌లోని షెడ్లు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను నగరంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హయత్‌ నగర్‌ అమ్మ ఆసుపత్రిలో 12 మంది, సన్‌రైజ్‌ లో నలుగురు, షాడో ఆసుపత్రిలో ఏడుగురు, మరో ముగ్గురు వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన దురదృష్టకరమని తెలిపారు. క్షతగ్రాతులకు అయ్యే వైద్య  ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. విపరీతమైన సుడిగాలి వలన ఈ ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నారు.

కనీస సదుపాయాలు లేవు: ఎంపీ కోమటిరెడ్డి
పండ్ల మార్కెట్‌లో కూలిపోయిన షెడ్లను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు. పండ్ల మార్కెట్లో మౌలిక సదుపాయాలు లేమి తీవ్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. కనీసం మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదన్నారు. మార్కెట్లో భౌతిక దూరం పాటిస్తున్న పరిస్థితి కూడా కనిపించడంలేదన్నారు. కోహెడలో పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేయాలని దివంగత మహానేత వైఎస్సార్‌ హయాంలోనే ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఇప్పటికైనా పండ్ల మార్కెట్‌లో కనీస సదుపాయాలు కల్పించాలని కోమటిరెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు