26 వరకు అసెంబ్లీ సమావేశాలు?

21 Nov, 2014 01:59 IST|Sakshi
26 వరకు అసెంబ్లీ సమావేశాలు?
  • నేటి బీఏసీ సమావేశంలో నిర్ణయం   
  •  కొత్త పారిశ్రామిక, ఇసుక, మార్కెట్ కమిటీలపై బిల్లులు
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 22వరకే శాసనసభ సభ నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో మొదట్లో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం సభలో బిల్లుల ఆమోదంతోపాటు, పలు అంశాలపై చర్చించాల్సి ఉందని, ఇప్పటి వరకు పద్దులపై కూడా పూర్తిస్థాయిలో చర్చ జరగలేదని భావిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశాలను పొడిగించడానికి సుముఖంగా ఉన్నారు.

    ఆయనే స్వయంగా అసెంబ్లీలోనే ఈ అంశాన్ని ప్రకటించారు. అవసరమైతే 20 రోజులపాటు శాసన సభా సమావేశాలు పొడిగించుకుని పూర్తిస్థాయిలో చర్చలు నిర్వహించుకుందామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం విది తమే. శుక్రవారం ఉదయం స్పీకర్ మధుసూదనాచారి వద్ద శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కానుంది.

    ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతల అభిప్రాయాలను తీసుకున్న తరువాత  సమావేశాల పొడిగింపును అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎజెండా ప్రకారం కాకుండా, అప్పటికప్పుడు వస్తున్న అంశాలపై సభ సుదీర్ఘంగా కొనసాగుతోంది. కాలపరిమితి లేకుండా సమావేశం ఒక అంశంపైనే కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల సమయంలోనూ అన్ని ప్రశ్నలు పూర్తికావడం లేదు.
     
    ముఖ్యమైన బిల్లుల కోసమే..

    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పారిశ్రామిక విధానం బిల్లును ఈ సమావేశా ల్లోనే ఆమోదించుకోవాలన్న ఆలోచనలో అధికారపక్షం ఉంది. తద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు వస్తారని భావిస్తోంది. అలాగే కీలకమైన ఇసుక విధానం బిల్లును కూడా ఈ సమావేశాల్లో పెట్టాలని, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేసే బిల్లుకు సభ ఆమోదం తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వివిధశాఖల పద్దులపై చర్చ సాగలేదు. పద్దులను సభలో ప్రవేశపెట్టారు. అలాగే ప్రభుత్వంపై సభ బయట ప్రతిపక్షాలు చేస్తున్న పలు ఆరోపణలను ప్రభుత్వమే ఏదో ఒక రూపంలో చర్చకు తీసుకువచ్చి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది.
     

మరిన్ని వార్తలు