తెలంగాణలో 154కి చేరిన కరోనా కేసులు

3 Apr, 2020 01:46 IST|Sakshi

27 కొత్త కేసులు

మరో 600 మంది పరీక్షల ఫలితాలు నేడు వచ్చే చాన్స్‌

వీరిలో 86 మంది ఢిల్లీ నుంచి వచ్చినవారు, వారి బంధువులే

ఢిల్లీ నుంచి వచ్చినవారిలో 30% మంది ప్రచారకులు

వారిని గుర్తించడంలోనే సమస్య.. నిఘా వర్గాల ప్రత్యేక దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం మరో 27 మందికి ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 154కి చేరింది. ఈ మొత్తం కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు, వారి బంధువులే 86 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. బుధవారంనాటికి 14 మంది డిశ్చార్జి కాగా, గురువారం మరో ముగ్గురు డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 128 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

అయితే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఏ జిల్లా నుంచి ఎన్ని వచ్చాయన్న దానిపై స్పష్టత లేదు. ములుగు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయని అక్కడి జిల్లా అధికారులు ప్రకటించినట్టు సమాచారం. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతినిధులు, వారి బంధువులు, స్నేహితులను తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు కాకుండా, ఇంకా 600 శాంపిళ్ల ఫలితాల కోసం వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఆ ఫలితాల ద్వారా ఇంకెన్ని కేసులు నమోదవుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులను బట్టి అంచనా వేస్తే భారీగానే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం వాటి ఫలితాలు రావొచ్చని చెబుతున్నారు. 

రాష్ట్రమంతా రెడ్‌జోనేనా?
ఢిల్లీలో ప్రార్థనలు చేసుకొని వచ్చినవారిలో 1030 మంది ఉన్నారు. వారు వేలాది మందిని కాంటాక్ట్‌ అయినట్లు అంచనా వేశారు. అన్ని జిల్లాల నుంచి వెళ్లడంతో ఇప్పుడు రాష్ట్రమంతా రెడ్‌ జోన్‌లోనే ఉన్నట్లుగా భా విస్తున్నామని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతీ ప్రాంతం, ప్రతీ గ్రామం, ప్రతీ జిల్లా కూడా లాక్‌డౌన్‌ను సీరియస్‌గా పాటించాల్సి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 70 శాతం మంది సాధారణ భక్తులు కాగా, మిగిలిన 30 శాతం మంది ప్రచారకులు అని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కరోనా ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు తెలిపారు. సాధారణ భక్తులు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారి ఇళ్లకు వెళ్లారు. కానీ ప్రచారకులు మాత్రం సంబంధిత మందిరాల్లో ఉం టారు. వారిలో కొందరిని గుర్తించగా, ఇంకా 130 మందిని గుర్తించాల్సి ఉందని తెలిసింది. ఈ ప్రచారకులకు కుటుంబం ఉండదు. వారు ఎక్కడుంటారో స్పష్టమైన చిరునామా కూడా తెలియదు. పైగా వారు మం దిరాల్లో ఉండటం వల్ల రోజూ వందల మందితో కలిసి తిరుగుతుంటారు. అలా వారు ఎంతమందితో కాంటాక్ట్‌ అయ్యారన్నదే ఇప్పుడు అధికారుల ను వేధిస్తున్న సమస్య. దీనిపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టిసారించాయి. 

మరిన్ని వార్తలు